కృష్ణుడు మధురానగరమేగుట

కృష్ణుడు మధురానగరమేగుట -శ్రీ విష్ణు పురాణము
Part 16
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
విముక్తుడైన వసుదేవుడు, నందుని దగ్గరకు వెళ్ళి, తనకు పుత్రుడుదయించాడని ఆనందపడుతూన్న నందుని చూశాడు. అప్పుడతడు బండిదగ్గర ఉన్నాడు. "మీరు రేపల్లెకు త్వరగా వెళ్ళిపొండి! కంసునికి కప్పంకట్టుట అయినది కదా! నాకూ రోహిణికీ పుట్టిన బిడ్డడు అక్కడే ఉన్నాడు కదా! మీ పుత్రునిలాగే భావించి వాడినికూడా కాపాడండి" అని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. త్వరగా అక్కడ్నుంచి కదిలారు.

గోకులంలో వారు సుఖంగా ఉండగా పిల్లల్ని చంపే రాక్షసి పూతన అక్కడకు వెళ్ళి, రాత్రిపూట నిద్రిస్తూన్న బాలకృష్ణుని ఎత్తుకుని పాలు ఇచ్చింది. అది ఎవరెవరికి చన్నుకుడిపితే వారు క్షణాల్లో మరణిస్తారు. కృష్ణుడు మాత్రం దాని చన్నుతో పాటు, దాని ప్రణాలనూ త్రాగేశాడు. పూతన మరణించగా, అందరూ అక్కడకు పరుగెత్తుకొచ్చారు. మశోద బాలదోషనివరణాది క్రియలు చేసి, రక్షపెట్టింది.

శ్రీకృష్ణునికి అంగరక్ష పెట్టించి, నందగోపుడు శాంతి కర్మ ఆచరించాక పెనుశరీరంతో నేలగూలిన పూతనను చూసి "ఈ బాలఘాతిని ఇక్కడకు వచ్చిందంటే, ఇందులో మనం అనుమానించవలసింది ఏమీలేదు. వసుదేవుడు ఆనాడే హెచ్చరించాడు" అనుకుంటూ భయాశ్చర్యలు క్రమ్ముకోగాఅ, శ్రీకృష్ణుని బండిక్రింద చిన్నమంచం మీద పడుకోబెట్టాడు.

ఒకసారి - ఆ బండిక్రింద పరుండిన బాలకృష్ణుడు, తన చిరుపాదంతో బండిని అలవోకగా తన్నే సరికి అది ఎగిరి తలక్రిందులుగా పడింది. అక్కడే ఉన్న పిల్లలను పిలిచి, దీన్నిల తిరగదోసిన దెవరని అడగ్గా, "ఈ చిన్ని కృష్ణుడే ఏడుస్తూ కాలు ఆడించగా ఇది ఇలా పడింది" అని చెప్పడంతో, ఆ బాలుడు సామాన్యుడు కాడని వారందరికీ అర్థమయింది. బాలుని కాలితాపుచే తిరగబడిన కుండలను పూలు - అక్షతలతో పూజించారు.

వసుదేవుడు పంపగా వచ్చిన గర్గుడనే మహర్షి బలరామకృష్ణులకు జాతకర్మాది సంస్కారాలు జరిపించాడు.

బాల్యచేష్టలతో బలరామకృష్ణులు వ్రేపల్లె నొక కొలిక్కి తీసుకువస్తూండగా యశోదా, రోహిణులు వారిని పట్టలేకపోతూన్నారు. అవులతో - దూడలతో వారి ఆటలు - దూకుళ్లు చూసేవారికి వినోద దాయకంగా మారాయి. వారిని వారింప శక్యంగాక యశోద, కృష్ణుని నడుమునకు, ఒక రోటికి కలిపి కట్టి వేసి ఇలా అంది.

"ఓరీ అల్లరిపిల్లవాడా! ఇప్పుడు కదులు చూద్దాం!" అని బెదిరించి, తాను అక్కడ్నుంచి వెళ్లి తన పనులుచూసుకోసాగింది. కృష్ణుడా రోటిని రెండు మద్దిచెట్ల మధ్యగుండా ఈడ్చుకొనిపోగా, ఆ వృక్షాలు విరిగిపడ్డాయి. ఆ పెనుశబ్దానికి అదిరిపడి రేపల్లె వాసులంతా అక్కడకు రాగా, చిర్నవ్వులొలుకుతూ వాటిమధ్య రోలుకు కట్టబడిన దామోదరుడు సార్థక నామధేయుడై కనిపించాడు.

నందుడు మొదలైన గోపవృద్ధులు, వ్రేపల్లెలో జరుగుతూన్న ఉత్పాతాలకు బెదిరి "గాలిలేకుండానే ఈ మహా వృక్షాలు కూలాయి. పూతన వినాశం - బండి తిరగబడుట వంటివి మనము ఎన్నడూ ఊహించనివి. కనుక మన మందరం ఇక్కడ ఇక నివసించవద్దు. బృందావనానికి పోదాం! ఈ అమంగళకర దోషం తొలిగేదాకా అక్కడే ఉందాం" అని ఒకరినొకరు హెచ్చరికలు చేసుకుని, ఆ క్షణమే ఆలమందలతో ఆ గోపాలకులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. క్షణాల్లో ప్రవేపల్లె కాశీఅయి జనశూన్యమై మిగిలింది.

సోదరుల బృందావన విహారం

ఆవులను, ఆలమందలను బలరామ శ్రీకృష్ణులు కాస్తూ, ఇద్దరూ బాలలీలలతో విహరించసాగారు. నెమలిపింఛాలు సిరస్సున తురుముకొని - అడవి పువ్వులను జటాజూటాల్లో అలంకరిస్తూ పరుగులెత్తి అల్లనల్లన ఆడుకోసాగారు.

తోటి గోపబాలురు కొందరు కొబ్బరాకులతో చేసిన బూరలతో లేగదూడలను అదలిస్తుంటే, వెదురుగొట్టాలతో తాము ధ్వనులు చేస్తూ బలరామకృష్ణ సోదరులు, తాళలయానుగుణంగ నర్తించారు.

ఏడేళ్ల ఈడుగలవారైన ఆ సోదరులిరువురు స్కందునికి జనించిన శాఖుడు - విశాఖుడు అన్నట్లుగ ఆ బృందావనంలో తిరుగసాగారు.

ఇతి శ్రీవిష్ణుపురణే పంచమాంశే షష్టోధ్యాయః

అకాశాన్ని అలుముకున్న మబ్బులతో మిన్నూ - మన్నూ ఏకం చేసేల వర్షధారలతో వర్షఋతువు ప్రవేశించింది. నదులు కట్టలు తెంచుకుని వరదలా ప్రవహిస్తున్నాయి. పచ్చని లేబయళ్లమీద ఆర్ద్రపురుగులు పద్మరాగమణుల్లా ప్రకాశిస్తున్నాయి. (ఇదంతా వర్షఋతు వర్ణనం)

తోటి గోప బాలకులు పాటలు పాడుతూంటే, అభినందుస్తూ - పిల్లనగ్రోవు లూదుతూ బాల్యచేష్టలతో ఆనందపరవశులవుతున్నారా సోదరులు.

సంధ్యవేళ గోవులతో - గోప బృందాలతో ఇల్లుచేరి, ఈడు జోడైన గోప బాలికలతో ఆటలాడుతూ ఆ వ్రజవాటిలో వసించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది