యయాతి స్వర్గలోక పయనం

ఆదిపర్వము – 15
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
యయాతి స్వర్గలోక పయనం
యయాతి తన కుమారులు ఐదుగురను పిలిచాడు. "కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశము ప్రకారము, మీలో ఎవరైనా నా ముసలిత్నాన్ని తీసుకొని, మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా" అని అడిగాడు.
అప్పుడు యయాతి కుమారులైన యదువు, ద్రుహ్వి, తుర్వసుడు, అనువు, యయాతిని చూసి "తండ్రీ, ముసలితనము అనేది వయోభారం వలన వస్తుంది. రోగం విధివశాత్తు వస్తుంది. కాబట్టి అవి రెండూ మానవులు అనుభవించక తప్పదు. కోరి కోరి ఎవరూ రోగాన్ని, ముసలితనాన్ని మరొకరినుండి తీసుకోరు. అదియున్య్ కాక, ముసలివాడు మన్మధుడైనా, యౌవనవతులు అసహ్యించుకుంటారు.కాబట్టి శరీర సుఖాలు అనుభవించ వీలులేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకొనడం మాకు ఇష్టం లేదు" అని చెప్పారు.
దానికి యయాతి కోపంతో "యదు వంశానికి చెందిన వారు రాజ్యం చెయ్యడానికి అనర్హులు. తుర్వసు వంశానికి చెందినవారు ధర్మా ధర్మములు తెలియని వారైన కిరాతకులకు రాజులు ఔతారు, ద్రుహ్యులు జలమయమైన ప్రదేశములకు రాజులు ఔతారు. అనువు వంశమునకు చెందిన వారు యవ్వనములో ఉండగానె మరణిస్తారు" అని శాపం పెట్టాడు.
ఇది అంతా చూసి, ఐదవ కుమారుడు పూరుడు అనే వాడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. "తండ్రీ నా యవ్వనాన్ని మీకు ఇస్తాను. మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను" అన్నాడు.
దానికి యయాతి సంతోషించాడు. పూరుడు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇచ్చాడు. యయాతి మరల నవయవ్వనుడైనాడు. తన భార్య ఐన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. వేయి సంవత్సరాలు యవ్వనవంతుడిగా ఇద్రియ సుఖాలు యధేచ్చగ అనుభవించాడు. తృప్తి చెంది మరల తన యవ్వనాన్ని తన కుమారుడైన పూరునికి ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పూరుడిని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేసాడు.

కాని పురజనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా, ఆఖరి వాడు పైగా దాసి పుత్రుడు ఐన పూరుడికి రాజ్యాధికారము ఎలా వస్తుందని యయాతిని అడిగారు.
"పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే, కాని నా మాట వినలేదు. తండ్రి మాట విననివాడు, తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు. పూరుడు చిన్న వాడైనా నా పట్ల గౌరవ మర్యాదలు కలవాడు, నా మాట నెరవేర్చాడు. అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసౌడు" అని యయాతి నిర్ణయించాడు.
తరువాత యయాతి తపోవనానికి వెళ్లాడు. వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్లాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి, ఇంద్ర లోకానికి వెళ్లాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించి, మర్యాదలు చేసాడు.
ఇంద్రుడు యయాతితో "యయాతి మహారాజా, నీవు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి, అతనికి రాజ్య భారాన్ని అప్పగించేటపుడు, నీవు అతనికి ఏమేమి నీతులు బోధించావు" అని అడిగాడు.
దానికి యయాతి "మహేంద్రా, ఎప్పుడూ మంచి వాళ్లతో స్నేహం చెయ్యాలి. వారితోనే మాట్లాడాలి. ఒకరికి ఇవ్వాలే గాని, మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు. అందరిని తృప్తిగా ఉండేట్టు చూడాలి. ఎప్పుడూ ఎదుటి వారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి. ఎదుటి వారి మీద దయ కలిగి ఉండాలి. గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరకు రానివ్వ కూడదు. అని చెప్పాను" అని అన్నాడు.
దానికి ఇంద్రుడు సంతోషించాడు. కాని యయాతిని పరీక్షించదలచి, "యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేసావో స్వర్గ లోక భోగాలు అనుభవిస్తున్నావు. నీ తపస్సు చాలా గొప్పది" అని అన్నాడు.
అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది. ఇంద్రుడు లాంటివాడు తనను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలచాడు. "అవును మహేంద్రా, ఈ లోకంలో మానవులు కాని, దేవతలు కాని, మహామునులు కాని చేసిన ఏ తపస్సు ఐనా నేను చేసిన తపస్సుకు సమానం కావు"అని గర్వంగా పలికాడు.
అప్పుడు ఇంద్రుడు అతనిని చూసి "యయాతీ, నీలో గర్వమింకా నశించలేదు. ఈ మాటతో నీ పుణ్యం హరించి పోయింది. నువ్వు స్వర్గలోకంలో ఉండటానికి అర్హుడవు కావు. మానవ లోకానికి వెళ్లు" అని చెప్పాడు.
దానికి యయాతి "మహేంద్రా, నేను మానవ లోకానికి వెళ్ల లేను. నక్ష్త్ర లోకానికి వెళ్తాను" అని అన్నాడు. దానికి ఇందుడు సమ్మతించాడు.
యయాతి నక్షత్ర లొకానికి వెళ్లాడు. అక్కడ యయాతి కూతురు కొడుకులు (మనుమలు), అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలిసి "మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు?" అని అడిగారు.

దానికి యయాతి "నేను నహుషుడి కుమారుడను, యయాతి మహారాజును. నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకము, దేవలోకము దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాను" అని అన్నాడు.

అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా గుర్తించారు. అతని నుండి జీవుల పుండొత్పత్తి, మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. వారికి యయాతి ఇలా చెప్పసాగాడు.
"అన్ని జీవుల యందు దయ కలిగి ఉండటం, ఎప్పుడూ నిజం పలకడం, వీటిని మించిన ధర్మం మరొకటి లేదు. ఇతరులను బాధించడం అధర్మం."
ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు:
"స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండము శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్రలు ఒక రూపం పొందుతుంది. తొమ్మిది నెలలు గర్భంలో ఉండి, ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తరువాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ, మంచి పనులు చెడ్డ పనులూ చేస్తుంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరు జన్మలో మంచి గర్భములో జన్మిస్తారు. ఆఖరుకు మోక్షం పొందుతారు. పాపము చేసిన వాళ్లు పశువులుగాను, పక్షులుగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తు, యజ్ఞ యాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమి తీసుకోకుండా, తమకు ఉన్న దాన్ని దానం చేస్తూ ఉండేవాళ్లు మంచి వాళ్లు. గర్వంతోనూ, ఆడంబరంతోనూ చేసే పనులు, యజ్ఞ యాగాలు మంచివి కావు" అని చెప్పాడు యయాతి.
తరువాత అష్టకుడు మొదలైన వారు యయాతితో "యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండవలెనా, మాకు పుణ్య లోకాలు లేవ" అని అడిగారు.
దానికి యయాతి "మీకు తప్పకుండా పుణ్య లోకాలు ఉన్నాయి" అన్నాడు. యయాతి మనుమలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్య లోకాలకు వెళ్లారు. వారితో కూడా ఉన్న యయాతికి, వారి సాంగత్యము వలన పుణ్య లోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్య లోకాలకు వెళ్లారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది