చిన్ననాటి మా ఊరు

చిన్ననాటి మా ఊరు
-------------------

అప్పటి మా వూరు...
దుమ్ముపట్టని అద్దంలా తళతళలాడేది...

కోడికూతకు ముందే...
వీధుల్లో గాజుల గలగలలు విన్పించేవి...
చీపుర్ల శబ్దాలు నిద్రలేపేవి...
కళ్లాపి ధ్వనులు మత్తు వదిలించేవి...

మంచం దిగి బయటికి రాగానే...
మా వీధి నా మనసుని ‘ముగ్గు’లోకి దింపేది...!

మా గ్రామాన్ని సంక్రాంతి మాసంలో చూడాలి...
మనుషుల అందాలకన్నా...
వీధి శోభలే ఎదల్ని దోచుకునేది...
నిత్యం సందడి ప్రవాహమయ్యేది...

మా గ్రామం అనేక కుటుంబాల్లా గాక...
గ్రామైక కుటుంబంలా ప్రవర్థిల్లేది...!

పక్కింటి వేడుకైతే...
తనింట్లో సంబరమని తలచుకునేవారు...

ఒకరింట కష్టమొస్తే...
ఊరు ఊరంతా అండగా నిలిచేవారు...
మౌనమెప్పుడు మా ఊర్లో ఉండేది గాదు...

అమ్మా, అక్కా, బావా, మావలంటూ...
ఏదో వరసల అలికిడి విన్పిస్తుండేది...!

బుడబుక్కలవాళ్లు, గంగిరెద్దులోల్లు...
బంధువుల్లా వచ్చి పలకరించేవాళ్లు...

కొండదేవర కొండదేవర పలుకంటూ...
గుండెలోని కష్టాన్ని తడిమిపోయేవాడు...

సోది చెబుతా సోది చెబుతానంటూ...
విషాదం గట్టెక్కు సూత్రాన్ని చెప్పిపోయేది...!

చిన్ననాటి మా ఊరు గుర్తొస్తే...
బాధతో గుండె బరువెక్కుతుంది...

అప్పటి అనుబంధాలు ఇప్పుడు లేవు...
అప్పటి ఆత్మీయతల జాడేలేదు...

ఆ ఇంటి కాకిని ఈ ఇల్లు సహించదు...
పైకి నోర్లు ప్రేమను పారిస్తాయి గానీ...
నొసల్లో విషం వెక్కిరిస్తుంది...

ఎవడి స్వార్థంలో వాడే బతుకుతున్నాడు...
ఒకడి మురుగు ఇంకొకడికి పులుముతున్నాడు...

ఒకడు ఇంకొకడిని అసూయ కండ్లతో గాయపరుస్తాడు...
ఇంకొకడొకడితో కయ్యానికి కాలు దువ్వుతాడు...!

ఇప్పటి మా ఊరు జూస్తే...
మనసు లోతులదాకా ముల్లు గుచ్చుకుంటుంది...

నిత్యం గాయాల పాలవడం నచ్చక...
అలనాటి వెలలేని మా గ్రామ జ్ఞాపకాల్లో దాక్కుంటాను...

అప్పటి మా ఊరు అద్దం నిండా...
ఇప్పుడు ఇంట్లో వాడేసిన చెత్తంతా కమ్ముకుంది...!

స్వచ్ఛభారత్ ఆచరణ...
మా గ్రామం నుంచి మొదలైతే ఎంత బాగుణ్ణు...
ఊరుని కడిగి మళ్లీ తళతళ మెరిపిస్తే ఎంతో బాగుణ్ణు...

పనిలో పనిగా...
మా గ్రామ మనుషుల మాలిన్యాన్నీ...తొలగిస్తే ఇంకా బాగుణ్ణు...!

నా చిన్ననాటి గ్రామ దర్పణంలో...
నన్ను నేను మళ్లీ దర్శించుకోవాలనుంది...

మళ్లీ మళ్లీ...
ఆనాటి మానవ సంబంధాల్ని చూడాలని వుంది...
ఆనాటి హృదయ గంధాల్ని ఆస్వాదించాలనుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది