భగవంతున్ని దర్శించటం ఎలా?

శ్రీరామకృష్ణులు - భక్తుల సందేహ నివృత్తి

ప్రశ్న: భగవంతున్ని దర్శించటం ఎలా?

శ్రీరామకృష్ణులు: ఈ కళ్ళతో చూడలేవు. భగవంతుడు దివ్య చక్షువులను ప్రసాదిస్తాడు. అప్పుడు మాత్రమే భగవంతున్ని దర్శించగలవు. భగవంతుడు అర్జునునికి దివ్య చక్షువుని ప్రసాదించడం వలనే అతడు ఆయన విశ్వ రూపాన్ని సందర్శించగలిగాడు. మీ వేదాంతం కేవలం ఊహాజనితం అది తర్కానికి మాత్రమే పనికొస్తుంది. ఆ మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందలేరు. నీలో రాగ భక్తి ఉదయించినప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వక ఎలా వుండగలడు? తన భక్తుల ప్రేమ పట్ల భగవంతునికి ఎంత మక్కువో నీకు తెలుసా? పశుగ్రాసం, తెలకపిండి పట్ల ఆవుకి ఎంత మక్కువో అంత. ఆ మేతను ఆవు గబుక్కున తినేస్తుంది.

ప్రశ్న: మహాశయా భగవంతుని స్వరూపం గురించి ఇన్ని విభిన్న అభిప్రాయాలు ఎందుకు వున్నాయి?

శ్రీరామకృష్ణులు:భక్తుడు భగవంతున్ని ఏ రకంగా చూస్తాడో భగవంతుడు ఆ రూపంలోనే వుంటాడని తలుస్తాడు. వాస్తవానికి భగవంతుని గురించి ఎలాంటి గందరగోళం లేదు. ఏదో విధంగా భగవత్ సాక్షాత్కారం కలిగినపుడు భగవంతుడే స్వయంగా దీని గురించి వివరించి చెబుతాడు. మీరు ఆ మార్గంలో ఆ పాదాన్ని మోపలేదు. అలాంటప్పుడు భగవంతుని గురించి సమస్తం తెలుసుకోగలం అని ఎలా ఆశిస్తారు.

ప్రశ్న: భగవంతున్ని దర్శింపగలమా?

శ్రీరామకృష్ణులు: తప్పక దర్శించవచ్చు. సాకారం, నిరాకారం రెండింటినీ దర్శించవచ్చు. భగవంతుని సాకారమైన చిన్మయ రూపమూ దర్శించవచ్చు. మానవరూపం దాల్చిన భగవంతున్ని ప్రత్యక్షంగా దర్శింవచ్చు. అవతారమూర్తిని దర్శించడం సాక్షత్తూ భగవంతున్ని దర్శించడంతో సమానం. ప్రతి యుగంలోనూ భగవంతుడు మానవరూపంలో అవతరిస్తున్నాడు సుమా.

ప్రశ్న: భగవంతుని దర్శనం కాని వారికి మార్గాంతరం ఏమిటి? వీరు లౌకిక కర్మలను పూర్తిగా వదిలేయాలా?

శ్రీరామకృష్ణులు: కలియుగానికి తగిన మార్గం భక్తి యోగమే. నారదుని భక్తి మార్గం... భగవంతుని నామమహిమలను కీర్తించడం. ఓ భగవంతుడా నాకు జ్ఞానం ప్రసాదించు, భక్తిని ప్రసాదించు, నీ దర్శనం ఇవ్వు అని వ్యాకుల చిత్తంతో ప్రార్ధించడం. కర్యోగం ఎంతో కష్టం కనుక భగవంతున్ని ఇలా ప్రార్ధించాలి. “ఓ భగవంతుడా నా కర్మలు తగ్గించు. నాకోసం వేటినొ కేటాయించావో వాటిని నీ దయ వలన అనాసక్తతతో నిర్వర్తించేటట్లు అనుగ్రహించు. అధికంగా పనులలో చిక్కుకోవాలనే ఇచ్ఛ నాకు రానివ్వకు”

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది