వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు
జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.
''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యేవరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.
వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.
అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.
తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.
ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.
ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.
వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.
* 'సత్యమేవ జయతే'కు అసలైన అర్థం
~~~ ~~~~~~~~~~~~~~~~~~
కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.
అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.
ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.
"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.
మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.
ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.
"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.
"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.
అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.
"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.
"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.
ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.
"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.
'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.
"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.
రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.
సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.
రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.
"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.
అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.
మళ్లీ రాజ్యం కళకళలాడింది.
ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం.
గురువును ఆశ్రయించే విధానం ఏమిటి
మనిషికి జ్ఞానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భగవంతుడు గీతలో చెప్పాడు “న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే” అని. జ్ఞానానికంటే పవిత్రమైనది మరొకటి లేదు అని. కనుక మనిషికి అత్యావశ్యకమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురువువల్ల మాత్రమే పొందడానికి వీలు అవుతుంది. అందువల్లనే జ్ఞానోపదేశం చేసి శిష్యుణ్ణి సంసారాంబుధి నుండి తరింపజేయగలిగినటువంటి వాడు గనుక గురువుకు అత్యంత ప్రాధాన్యం శాస్త్రంలో చెప్పబడింది.
గురువును ఆశ్రయించే విధానం ఏమిటి అంటే దానికి కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. “తద్విద్ధి ప్రణిపాతేణ పరిప్రశ్నేన సేవాయా! ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః” – గురువు సన్నిధిలో పునీతుడవై గురువుయొక్క సేవలొనర్చి, గురువుకు నమస్కరించి, గురువుగారి సన్నిధిలో నీయొక్క సందేహాన్ని వెలిబుచ్చి వారివల్ల నీ సందేహములను పరిష్కరించుకోవలసినది. ఆ గురువుయొక్క అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానివల్ల నీవు శ్రేయస్సు పొందుతావు అని భగవంతుడు చెప్పాడు.
శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుంచి
ఆచార్య పరంపర అంటే ఏమి?
(జగద్గురుబోధలనుండి)
ప్రపంచంలో ఉన్న అందరలోనూ చైతన్యం ఉన్నది. అదియే నిజవస్తువు. సత్యవస్తువు. ఆ చైతన్యమే మన మందరమూ, ప్రతివారి దేహమునందూ ఈ చైతన్యం ఉన్నది.
'యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ' - మనీషాపంచకం.
ఒక దివ్వె ఉంటే అది వస్తువులను చూడడానికి కుపయోగపడుతుంది. కాని చూడడానికి కన్నులు లేకుంటే దివ్వెతో ఏమిపని? అంతా చీకటే. కన్నులున్నప్పటికీ మనసు లేకపోతే ఆ కన్నులు చూడలేవు. మైకం వచ్చి కింద పడితే కన్నులు తెరచి కొనియే ఉన్నాచూపు మాత్రం ఉండదు. అలాగే మనసు మాత్రం ఉన్నా చాలదు. ఆ మనసులో ఆత్మజ్యోతి అణగి ఉండాలి. ఆత్మజ్యోతి ప్రసారం ఉన్నంతవరకే మనస్సు తలచినా కన్నులు చూచిన దివ్వె వెలుగున వస్తువులచే కనుగొన్నా. దివ్వె మెలునులో జడవస్తువులు కనబడతై. వీని కన్నిటికీ మూలం ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతియే చైతన్యం. చైతన్యం ఒక్కటంటే ఒక్కటే. మెరుపు వెలుగులో వ్యత్యాసం ఏమీ లేదు. ఒక బొత్తాము నొక్కితే చాలు. దివ్వెలన్నీ వెలుగుతవి కాని దివ్వెను బట్టి వెలుగు ఉంటుంది. అట్లే చైతన్యం ఒక్కటే అయినా ఉపాధినిబట్టి పరిపాకాన్నిబట్టి వెలుగులో తేడా ఉంటుంది. ఆత్మజ్యోతిని నిండుగా ప్రకాశింపచేయడానికి, దుఃఖం లేని జీవనం గడపడానికి తగిన సాధనాలను మనకు ఉపదేశించడానికి, మనకు ఆచార్య పరంపరకావాలి. ఒక ఆచార్యులు తమ తరువాతి కాలంలో తాము నిర్దేశించిన పనులు చేయడానికి మరొకరికి తమ అధికార మిచ్చిపోతారు. ఇట్లా వరుసగా ఒకరి తరువాత ఒకరుగా వచ్చినవారే ఆచార్య పరంపర. అట్టి పరంపర యెడల మనము కృతజ్ఞత కలిగియుండాలి. ఆత్మనిధిని సురక్షితముగా మన కిచ్చెడివారు వీరే. ఈ నిధి మన కెవరెవరి మూలముగా ఈ నాటికిని లభ్యమవుతూందో వారి నందరనూ ధ్యానిస్తే మనకు వారి అనుగ్రహమధికంగా కలుగుతుంది. అంచేత ఆత్మతత్త్వ మెరుగగోరేవారందరికీ గురు పరంపరాజ్ఞానం అత్యవసరం.
మన ఆచార్య పరంపరలో పరమగురువు నారాయణుడు. తరువాత బ్రహ్మ. వశిష్ఠులు, శక్తి, పరాశరులు, వ్యాసులు, శుకులు. శుకులవరకూ గురు పరంపర పుత్ర పరంపరగాఉన్నది. శుకుడు పుట్టుకతోనే జ్ఞాని. కనుక వారిపిదప అది శిష్యపరంపరగా ఏర్పడ్డది.
స్త్రీలు మధ్యలో పాపిడి తీయవలెను మరియు పురుషులు ఎడమ వైపు పాపిడి తీయవలెను.
పురుషులు జుబ్బా-ధోతి/పైజామా మరియు స్త్రీలు చీర / పంజాబి దుస్తును ధరించవలెను.
భోజనమును దేవునికి సమర్పించి ప్రసాదమును నామజపం చేస్తూ స్వీకరించవలెను.
ఆనందమయ జీవనం కొరకు ఆచారధర్మమును పాటించండి !
దేవుని పంచోపచార పూజను ఎలా చేయవలెను ?

గంధము : దేవునికి అనామిక వ్రేలుతో గంధమును పెట్టవలెను.
పువ్వులు : ఆయా దేవతల తత్వాన్ని ఆకర్షించే పూలను దేవునికి సమర్పించవలెను.
అగర్బత్తీలు : ఆయా దేవతకు పూరకమైన సువాసన గల 2 అగర్బత్తీలను వెలిగించవలెను.
దీపము : దేవునికి నెయ్యి దీపముతో 3 సార్లు హారతి చేయవలెను.
నైవేద్యము : దేవునికి తయారు చేసిన నైవేద్యంను అరటిఆకు పై పెట్టవలెను.
(ఆధారం : సనాతన గ్రంథం ‘పంచోపచార మరియు షోడశోపచార పూజా శాస్త్రం’)
దేవుని దర్శనం చేసుకునే సరైన పద్ధతి

ముందు కళశం తరువాత మెట్లకు నమస్కరించాలి.
క్రమంగా దేవత చరణాలు, ఛాతి, కన్నుల వైపుకు చూడాలి తరువాత దేవునికి నమస్కారం చేయాలి.
మనస్సులో నామజపం చేస్తూ మధ్యమ గతిలో ప్రదక్షిణలను చేయవలెను.
కూర్చొని నామజపం చేసి, దేవునికి నమస్కారం, ప్రార్థన చేసి బయలుదేరవలెను.
బయటకు వచ్చిన తరువాత కళశానికి మరొక్కసారి నమస్కారం చేయవలెను.
ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనం ఎలా చేసుకోవలెను ?’
వద్దనుకున్న దేవతా చిత్రాలను నిమజ్జన చేయండి !

వద్దనుకున్న దేవతా విగ్రహాలు/చిత్రములను దేవస్థానములో/వృక్షం క్రింద పెట్టడం వలన అవి శిథిలమై వాటికి అవమానము జరుగును. అందు వలన ఇలాంటి దేవతల చిత్రములను అగ్నికి సమర్పించండి మరియు విగ్రహాలను నీటిలో నిమర్జన చేయండి అని ధర్మశాస్త్రముచెప్పును.
(ఆధారగ్రంథము : ధర్మసింధు)
హిందూ ధర్మానికనుగుణంగా పుట్టిన రోజు ఆచరించండి !

పుట్టినరోజు పండుగను శాస్త్రంలో చెప్పినట్టు తిథికనుగుణంగా, నూనె దీపముతో హారతి ఇచ్చి ఆచరించవలెను.
కొవ్వొత్తులను ఆర్పి మరియు కేక్ కోసి పుట్టినరోజును జరుపుకోకండి !
శుభాకాంక్షలను తెలుగులోనే చెప్పండి !
ఇంటి దేవత పూజ చేయవలెను మరియు కనీసం 3 మాల జపం చేయవలెను.
పాశ్చాత్యుల వలె పుట్టిన రోజు ఆచరించి సంస్కృతి విరోధకులు కాకండి !
(ఆధారం : సనాతన గ్రంథం 'కుటుంబీక ధార్మిక కృతులు మరియు సామాజిక కృతులకు గల శాస్త్రం')