నిత్యనైమిత్తిక క్రియలు

నిత్యనైమిత్తిక క్రియలు-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 35

ఔర్యుడు చెప్తూన్నాడు. ..కుమారుడు జన్మించగానే తండ్రి అభ్యుదయ కామనతో ఆ పిల్లాడికి జాతకర్మాది శుభకార్యములు నిర్వర్తించాలి.

బ్రాహ్మణదంపతులకు భోజనాలు పెట్టాలి. తండ్రిచేత 11వ రోజున పిల్లవాడికి నామకరణం జరిగితీరాలి. బ్రాహ్మణాది నాలుగవర్ణాలవారికి వరుసగా అంత్యపదముగా శర్మ, వర్మ, గుప్త, దాస పదాలు ఉంచాలి. "ఎటువంటి పేర్లు పెట్టాలి?" అనేది కూడా ఈ పురాణంలో సూచితమైంది. అర్థములేని, ప్రశస్తముకానివి, అపశబ్దవాచకములు, అమంగళకరమైనవి, ఏవగింపును కలిగించేవి, పలుకుటకు జటిలంగా ఉండేవి పేర్లు పెట్టరాదు. సమాన అక్షరాలున్నదీ, మరీపొట్టి - మరీపొడుగూ కానిదీ, ద్విత్వాక్షరాలు అధికంగా లేనిదీ, సుఖంగా పలుకడానికి వీలైనదీ, అంత్యమున లఘువులు (అక్షరాలు) ఉన్న పేర్లు పెట్టడం యుక్తం.

తదుపరి బాలుడు ఇతర సంస్కారాలైన అన్నప్రాశన - ఉపనయనం వంటి వానిచేత సంస్కరింపబడి, గుర్వాశ్రమం చేరి, వినయ విధేయతలతో విద్యార్జన చేయాలి.

ఈ బాలబ్రహ్మచారి యవ్వనోదయకాలం వరకు గురువు ఇంట విద్యనభ్యసించి, గురుదక్షిణ ఇచ్చి ఇంటికి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించాలి. లేదా గురు శుశ్రూష చేస్తూ యావజ్జీవం నైష్ఠిక బ్రహ్మచారిగా గడపవచ్చు! లేదా ఇచ్ఛానుసారం పరివ్రాజకునిగా పరిణమించవచ్చు. అయితే - ఇవి అన్నీ తల్లిదండ్రుల అనుమతితోనే చేయవలసి ఉంటుంది.

తనకంటె రెండురెట్లు చిన్న వయస్సుగల దానిని పెండ్లాడాలి. 8 రకాల వివాహాలున్నాయి. 1. బ్రాహ్మము, 2. దైవము, 3. ఆర్షము, 4. అసురము, 5. ప్రాజాపత్యము, 6. గాంధర్వము, 7. రాక్షసం, 8. పైశాచము. ఇవి ఏ వర్ణానికేది యుక్తమో ఋషులు చెప్పివున్నందున ఆ ప్రకారమే చేయాలి.

సప్తర్షులు, మనువులు చెప్పిన సదాచారాలు ఇవీ...అంటూ ఔర్యుడు సగరునికి ఇలా చెప్పాడు....

గృహస్థునికి సదాచారాలు

ఓ సగర భూపతీ! సూర్యోదయానికి పూర్వమే (మూడవజామున బ్రాహ్మీముహుర్త కాలంలో) నిద్రమేల్కొనేవాడు శ్రేష్ఠుడు. కాలకృత్యాలు తీర్చుకొనేందుకు ముందుగా - అనగా మేల్కాంచిన వెంటనే భగవధ్యానం ధర్మచింతన చేయాలి.

కాలకృత్యాలు తదుపరి ముఖం ప్రక్షాళన చేసుకోవడం, స్నానాదివిధులు నిర్వర్తించుట, మంగళకరద్రవ్యాలు అలంకారార్థం వినియోగించుట, అటుపైన వర్ణోచితమైన ధర్మాలు పాటించుట విజ్ఞులు చేసే ఉత్తమక్రియలు.

స్నానానంతరం పితృదేవతాప్రీత్యర్ధం తర్పణాలు విడవాలి. ఈ దేవాది తర్పణోదకం, భూతోపకారాన్ని ఉద్దేశించి చేసే విధిగా కూడా చెప్పబడింది. "దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, చెట్లు, పక్షులు, వాయ్వాధార జంతువులు అన్నీ నేనిస్తున్న ఈ తర్పణంతో శీఘ్రంగా తృప్తి చెందెదరుగాక! సకల సత్త్వములయందు నూ యాతనాశరీరములందు గలవారి తృప్తికై నాచే ఈ జలములు ఇవ్వబడినవి. ఎచ్చట ఉన్నప్పటికీ, ఆకలిదప్పుల చేత బాధపడే జీవులన్నిటికీ తృప్తి కలుగుగాక" అని చెప్పి జలాన్ని విడవాలి.

ఇదీ కామ్యోదక ప్రదానము. తదుపరి సూర్యునికి నమస్కరించాలి.

అటుపైన గృహాంతర్భాగాన వసించి ఉండే దేవతలను (దేవుని మందిరంలో / ఇష్టదేవతలకు) ఆరాధన చెయ్యాలి. వైశ్వదేవం (అగ్నిహోత్రాన్ని) ఆచరించాలి. దిగ్దేవతారాధనం, భూతబలి నిర్వర్తించాలి. "సమస్త భూత ప్రపంచము (ప్రాణులన్నీ), నేనూ, విష్ణువు కంటె వేరుకాదు. దేవ మనుష్య ఉరగ దైత్య పశు పక్ష్యాదులన్నీ నాచే ఇవ్వబడిన ఈ అన్నంతో తృప్తినొందుగాక" అని పలుకుతూ అందరికీ ఆశ్రయమివ్వగల సామర్జ్యం ఉన్నగృహస్థు అన్న దానం చేయాలి. మధ్యాహ్నవేళ ఇంటిముంగిట అతిథి కోసం 1/4 ఘడియకాలం వేచి చూడాలి. సమయానికి మనవద్దకు వచ్చే అతిథి సాక్షాత్‌ విష్ణువని తెలియాలి. అతడ్ని పూజాదిక సత్ర్కియలతో సంతృప్తి పరచి భోజనం ఆరగింపచేయాలి. తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా - ఇతర దేశాల నుంచి వచ్చేవాడైనా - దరిద్రుడే అయినా నారాయణునిగా భావించి అతిథి సత్కారం జరపాలి. ఆ సమయంలో వచ్చే అతిథిని విడిచి గృహస్థు భుజిస్తే పతితుడవుతాడా గృహస్తు.

భోజన విధులు

ఎవరి ఇంటి నుంచి అతిథి విఫలమైన భోజనాపేక్ష గలవాడై వెళ్తాడో, అతడు తన పాపాన్ని ఆ గృహస్తు యజమాని పరం చేసి - అతని పుణ్యాన్ని తీసుకు వెళ్లేవాడవుతాడు. అతిథిని (అంటేనే - తిథి వారవర్జ్య సమయాదులు ఏవీ పట్టించుకోక వచ్చేవాడని అర్థం). ఆవహించి వుండే ప్రధాన దేవతలు - సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని,ధాల, ప్రజాపతి, వసుగణాలు. వీరు అతిథి రూపాన ప్రవేశించి అన్నం భుజించడానికి రావచ్చును. కనుక వీర్ని వెళ్లగొట్టడం ద్వారా నరుడు ఆయాదేవతల పట్ల అపచారం చేసిన వాడౌతున్నాడు. కొందరు ప్రయత్నపూర్వకంగా నిరీక్షించి, అతిథికి భోజనాది సత్కాకారాలు జరిపించి ఇహపరములలో శాశ్వత నివాసం పొందిన వారౌతారు. అతిథి లేకుండా భుజించినవాడు కేవలం పాపాలను భుజించిన వాడు అవుతూన్నాడు.

భోజనం చేసేటప్పుడు చిరాకు - పరాకు పనికిరాదు. సంతుష్టుడై భుజించాలి. (విశుద్ధ వదనః ప్రీతో భుంజీత న విదిజ్ముఖః) అలాగే ఒకే ఒక వస్త్రాన్ని ధరించిగాని, విదిక్కులకు ఎదురుగా గాని, తడికాళ్లతో తడివస్త్రాలతో గాని భోజనం నిషిద్ధం ! తూర్పు ఉత్తర దిశలకు అభిముఖంగా భుజించడం గృహయజమానికి క్షేమం. గాయత్రీ మంత్రోదకం చేత సంప్రోక్షించినది శ్రేష్ఠం! (అనివార్య పరిస్థితుల్లో) అది కుదరకపోయిన - అతిథి పూజనం చేశాక భోజనానికి కూర్చోవడం ఉత్తమం.

ఆహారపదార్థాలలో మొదట ద్రవహారాన్ని మధ్యలో ఘనాహారాన్ని చివర తిరిగిద్రవహారాన్ని భుజించాలి. తినే అన్నాన్ని నిందించకూడదు. "ఈ ఆహారం నాకు హితం గూర్చుగాక! నాకు పుష్ఠికరమగును గాక! అగస్త్యుడు, అగ్ని, బడబాగ్ని నాచేగ్రహించబడే ఈ ఆహారాన్ని నిశ్శేషంగా జీర్ణింపజేయుదురు గాక!" అని ఉచ్చరిస్తూ చేతితో పొట్టనిమురుకుంటూ అలసటలేనివాడై శ్రమ కలిగించని పనులు చేయాలి. సత్యాహిత్య పఠనం, సద్వినోదాలతో పగటిపూట గడపాలి. సావధానంగా సంధ్యోపాసన చేయాలి. ఏదైనా ఆపత్సమయంలో తప్ప ఉదయ, సాయం సంధ్యలలో నిదురించరాదు. ఆ సమయంలో వచ్చిన అతిథిని శక్తి మేరకు ఆదరించాలి. పగటిపూట ఏ అతిథి అయినా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లడం తటస్థిస్తే ఎంతపాపం వస్తుందో, అంతకు ఎనిమిది రెట్లు పాపం సాయం సంధ్యానంతరం వచ్చిన అతిథి నిరాశగా వెళ్లడం వల్ల సంక్రమిస్తుంది. రాత్రి వచ్చిన అతిథి పూజింపబడితే, సకలదేవతలు పూజింపబడినట్లే!

భోజనానంతరం నిద్రించేటప్పుడు తూర్పువైపు - దక్షిణవైపు తలపెట్టి నిద్రించాలి. విదిక్కులు పనికిరావు. ఉత్తర పశ్చిమాలు రోగోప్రదము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది