ఆదిపర్వము – 20

ఆదిపర్వము – 20
🌺🌺🌹🌹🌼🌼🌹🌹🌺🌺
భీష్ముడి జన్మవృత్తాంతం
ఒకరోజు ప్రతీపుడు, శంతనుని పిలిచి "కుమారా, ఒకరోజు గంగానదీ తీరాన ఒక కన్యను చూసాను. ”నువ్వు నా కొడుకుకు భార్యవు కమ్ము" అని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహము చేసుకొనుము. ఆమెను గురించి వివరాలు ఏమి అడగకుండా ఆమె కోర్కె తీర్చు" అని చెప్పాడు. శంతనుడు సరే అన్నాడు.
తరువాత ప్రతీపుడు తపోవనానికి వెళ్లిపోయాడు. శంతనుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్లాడు. గంగానదీ తీరంలో, ఒక అందమైన కన్య(గంగ)ను చూసాడు. ఆమె అందానికి ముగ్ధుడై ఆమెనే చూస్తున్నాడు. ఆమె కూడా శంతనుని అందానికి పరవశించి అతనినే చూస్తూ ఉంది.
తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శంతనునికి, పైగా ఆమె మీద మనసు పడ్డాడు శంతనుడు. అందుకని ఆమె చెప్పిన వాటికి ఒప్పుకున్నాడు. గంగను వివాహం చేసుకున్నాడు.
గంగకు శంతనుడికి, వౌవులు ఒకరి వెంట ఒకరు కుమారులుగా జన్మించారు. గంగ వారందరిని పుట్టిన వెంటనే గంగానదిలో పడవేసింది. శంతనుడికి మనసులో బాధగా ఉన్నా అనుకున్న మాట ప్రకారం ఏమీ అనే వాడు కాదు. అలా ఏడుగురు వసువులూ పుట్టారు, చనిపోయారు.
అష్టమ వసువు ఐన ప్రభాసుడు జన్మించాడు. ఈసారి శంతనుడు ఊరుకోలేదు. "ఇప్పటిదాక పుట్టిన వారందరిని గంగలో వేసావు. నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు, నేను ఇవ్వను" అన్నాడు.
"శంతన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు. నేను వెళ్లిపోతున్నాను. నేను ఎవరో తెలుసా, నేను గంగను. అష్ట వసువులు వశిష్ట మహాముని శాపంతో మానవ లోకంలో పుట్టారు. వారు కోరిన కోరిక ప్రకారం నా గర్భంలో జన్మించారు. పుట్టగానే వారికి విముక్తి కలిగించాను. ఈ ఎనిమిదవ వాడు చిరకాలం జీవిస్తాడు. కీర్తి మంతుడవుతాడు" అని చెప్పింది గంగ.
"ఓ గంగా, వసువులు దేవతలు, దోషము లేనివారు కదా. వశిష్ట మహాఋషి వారికి ఎందుకు శాపం ఇచ్చాడు?. అందులో ఎనిమిదవ వాడూ మాత్రం మానవ లొకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తాడు? వివరంగా చెప్పు" అని అడిగాడు. అప్పుడు గంగ ఇలా చెప్పింది.
"శంతన మహారాజా, వరుణుడి కుమారుడైన వశిష్టుడు అనే మహాముని మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్టుని ఆశ్రమంలొ నందిని అనే కాంధేనువు ఉంది. అది వశిష్టునికి కావలిసిన వస్తువులు అన్నింటినీ ఇస్తూ వశిష్టునికి సేవచేస్తూ ఉంది.
ఒకరోజు అష్ట వసువులు వశిష్ట ఆశ్రమానికి వచ్చారు. కామధేనువును చూసారు. దాని మహిమకు అశ్చర్యపోయారు. అందులో ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో ఇలా అంది.
"నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి రోగం, ముసలి తనము లేకుండా బతుకుతారు అంటారు కదా. మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడు అయి ఉండాలి. కాబట్టి ఈ ధేనువును నా ప్రాణ స్నేహితురాలు జీతవతికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉంది" అని అడిగింది.
మిగిలిన వసువులు కూడా ఆమెకు వంత పాడారు. ఎనిమిదవ వసువు ప్రభాసుడు, నందిని అనే కాంధేనువును పట్టుకొని తీసుకొని వెళ్లాడు. వశిష్ట మహాముని తన యోగ దృష్టితో ఇదంతా చుసాడు. ఆయనకు కోపం వచ్చింది. "మీరందరూ మానవులై పుట్టండి" అని శాపం ఇచ్చాడు. వసువులందరూ వశిష్టుని కాళ్ల మీద పడ్డారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకున్నారు.
"అలాగే జరుగుతుంది, కాని అసలు నేరం చేసిన వాడు ఈ ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుడు. వాడు మాత్రం చిర కాలం మానవలోకంల ఉంటాడు. సంతాన హీనుడిగా బతుకుతాడు" అని అన్నాడు వశిష్టుడు. తరువాత జరిగిందంతా మీకు తెలిసిందే" అని చెప్పింది గంగాదేవి.
ఇదంతా విని శంతనుడు ఆశ్చర్యపోయాడు. జరిగిందానికి విచారిస్తూ హస్తినాపురానికి వచ్చాడు.
కొంతకాలం తరువాత, ఒకరఒజు శంతనుడు వేట నిమిత్తము గంగానదీ తీరానికి వెళ్లాడు. ఒక చోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్టు అయింది. శంతనుడు ఇది చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ గంగానది వెంట నడుస్తున్నాడు. అక్కడ ఒక చోట ఒక బాలుడు గంగా నదికి అడ్డంగా తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు. అతనే గంగా సంతనుల కుమారుడు దేవవ్రతుడు. కాని శంతనుడు ఆ కుమారుని గుర్తించలేదు.
ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చింది. "ప్రభూ, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్టుని వద్ద వేదాలు నేర్చున్నాడు. శుక్రుడు, బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. పరశురామునితో సమానంగా ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ఇంక నీ కుమారుని స్వీకరించుము" అని కుమారుని శంతనునికి అప్పచెప్పి గంగ వెళ్లిపోయింది. వీరుడు, ధీరుడు, గుణవంతుడు, సకల విద్యాపారంగతుడు అయిన కొడుకును చూసి శంతనుడు ఉప్పొంగిపోయాడు. కొడుకుతో సహా హస్తినాపురానికి వచ్చాడు. దేవవ్రతునికి యౌవ్వ రాజ్య పట్టాభిషేకం చేసాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది