కర్తవ్య బుద్ధి ప్రధానం
దానం అన్నది గొప్ప గుణం. దానాన్ని పుణ్యం కోసం కాకుండా కేవలం కర్తవ్య బుద్ధితో చేయాలి. ఎంతో వినయపూర్వకంగా ఇవ్వాలి. అప్పుడే ఆ దానం విశేషమైనదిగా నిలుస్తుంది. ప్రదర్శన కోసం, తానింతవాడినని చెప్పుకోవడానికి దానం చేయడం గొప్ప అనిపించుకోదు. మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేథ యాగం చేసి అనేక దానాలు చేశాడు. ఆ సందర్భంలో ధర్మరాజులాంటి వాడికే అంతో ఇంతో అహం ఆవేశించింది. నేను చాలా గొప్ప దానాలు చేస్తున్నాననే భావన మనసులో కలిగింది. ఆ సమయంలో ఒకానొక ముంగిస ఆ యజ్ఞస్థలానికి వచ్చింది. దాని శరీరం సగం బంగారం, సగరం సాధారణంగా ఉంది.
ధర్మరాజు దానాలు చేసేటప్పుడు వదిలిన నీళ్లలో బాగా దొర్లింది ముంగిస. చాలాసేపు దొర్లి నిరాశతో వెనక్కు వెళ్తుంటే శ్రీకృష్ణుడు దాని నిరాశకు కారణం అడిగాడు. అప్పుడు ఆ ముంగిస ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ఒకానొక పేదవ్యక్తి అతిథులకు దానం చేసిన సమయంలో అనుకోకుండా అతడు దానం చేసి వదిలిన నీళ్ల మీదుగా వెళ్లాను. ఆ దానం గొప్పదనం వల్ల ఆ నీళ్లు తాకినంత భాగం బంగారంగా మారిపోయాను. మిగతా శరీరాన్ని బంగారంగా మార్చుకోవాలని గొప్ప గొప్ప వాళ్లు దానాలు చేసే చోటుకల్లా వెళ్తున్నాను. చివరకు ధర్మరాజు గొప్ప దానాలు చేస్తున్నాడని ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాను. నా మిగతా శరీరం కూడా బంగారు వర్ణంలోకి మారుతుందని.. ధర్మరాజు దానం ఇస్తూ వదిలిన నీళ్లలో దొర్లాను. అయినా లాభం లేదు’’ అని పలికింది ముంగిస. ఆ మాటలు విని ధర్మరాజు సిగ్గుపడ్డాడు. అహంభావాన్ని వదిలి దానధర్మాలు కొనసాగించాడు.