🍑🍑🍑ఓం నమో నారాయణాయ🍑🍑🍑
🍓🍓🍓ఓం కుమార స్వామినే నమః🍓🍓🍓
మతభేధాలు తప్పు అన్న పరమేశ్వరుడు
ఈ కథ వరాహపురాణంలో ఉంది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరిని పూజించాలి? ఎవరిని గురించి తపస్సు చేస్తే కోరుకున్నవి నెరవేరతాయి? అనే సందేహం పూర్వం ఓసారి అగస్త్య మహామునికే వచ్చింది. అప్పుడాయన సందేహం ఎలా నివృత్తి అయింది అని చెప్పే కథా సందర్భం ఇది. మహారాజుకు అగస్త్యుడు తన స్వానుభవాన్ని వివరించాడు.
పూర్వం సర్వలోక జ్ఞానప్రాప్తికి అగస్త్యుడు ఎవరిని ఆరాధించాలా అని ఆలోచించి తనకు తెలిసినంతలో సనాతనుడు, యజ్ఞమూర్తి అయిన విష్ణువును ఆరాధించటం ప్రారంభించాడు. అలా ఆ యజ్ఞమూర్తిని చాలాకాలం పాటు ఆరాధిస్తుండగా ఓ రోజున యజ్ఞమూర్తి ప్రత్యక్షం కాలేదు. కానీ దేవేంద్రుడితో సహా దేవతలంతా అగస్త్యుడి ఆశ్రమానికి వచ్చారు. తాను యజ్ఞమూర్తిని ఆరాధిస్తుంటే ఆయన ప్రత్యక్షం కాక ఈ దేవతలంతా వచ్చారేమిటబ్బా.. అని అగస్త్యుడు ఆలోచిస్తుండగానే ముక్కంటి నీలలోహితుడు అయిన శివుడు అక్కడికి వచ్చి నిలుచున్నాడు.
ఆయనను చూడగానే దేవతలు, రుషులు అంతా కలిసి ఆ రుద్రమూర్తికి నమస్సులర్పించారు. ఇంతలో మహాయోగి, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడు అయిన బ్రహ్మ ఓ విమానంలో అక్కడకు వచ్చాడు. అలా దేవతలంతా అక్కడకు వచ్చారు కానీ అగస్త్యుడు అనుకొన్నట్లు విష్ణువు మాత్రం రాలేదు. ఇదేమిటి నేననుకొన్నట్లుగాక ఈ దేవతలంతా వచ్చారేమిటి? అని ఆ ముని అనుకొంటూ ఇంతమంది దేవతల్లో అసలు పూజనీయుడెవరు? అనే సందేహం కలిగి రుద్రుడు వైపున తిరిగి అదే విషయాన్ని గురించి అడిగాడు. అప్పుడు రుద్రుడు ఇలా చెప్పటం ప్రారంభించారు.
ఓ మునీ.. లోకాలన్నీ సర్వయజ్ఞాలతో యజిస్తున్నది ఎవరినో, ఎవరి వల్ల ఈ జగత్తంతా దేవతలతో సహా పుడుతోందో.. అలాగే ఈ జగత్తంతా ఎప్పుడూ ఎవరిలో నిలిచి ఉంటుందో, ఎవరిలో విలీనమవుతోందో ఆ పరదైవమే సత్యరూపమైన భగవంతుడు. ఎవరు ఎంతమంది దేవతలను గురించి ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని నమస్కారాలు పెట్టినా అవన్నీ ఆ భగవంతుడికే చెందుతాయి. ఆ దేవదేవుడే లోకపాలనా సౌలభ్యం కోసం మూడు రూపాలుగా సృష్టించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవే ఆ రూపాలు. సత్వరజస్తమోగుణాలలో సత్వగుణం చేత జీవికి ముక్తి కలుగుతుంది. ఆ సత్వం నారాయణాత్మకం. యజ్ఞరూపుడైన నారాయణుడే ఆ భగవానుడు.
ఈయన నాలుగు యుగాలలో నాలుగు విధాలుగా లోకవాసుల చేత పూజలందుకొంటుంటాడు. కృతయుగం లోని వారు సూక్ష్మ రూపంలో ఉండే భగవంతుడిని ఉపాసిస్తారు. త్రేతాయుగం లోని ప్రజలు యజ్ఞరూపంలో ఉన్న భగవంతుడిని అర్చిస్తారు. ద్వాపరంలో పాంచరాత్ర సిద్ధాంతాన్ని అనుసరించే వారు ఆయనను ఉపాసిస్తారు. కలియుగంలో అనేక రూపాలలో ఆ భగవంతుడు పూజలందుకొంటుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి కంటే పరదైవం ఇంకొకటి లేదు. విష్ణువే స్వయంగా బ్రహ్మ. బ్రహ్మే స్వయంగా రుద్రుడు.. అని బ్రహ్మ విష్ణు రుద్రులకు ఏ భేదాన్ని పాటించకుండా అందరూ ఆరాధించాలి. ఆ ముగ్గురిలో భేదాన్ని భావించిన వాడు పాపకారి, దుష్టాత్ముడు అవుతాడు.
ఇలా రుద్రుడు అగస్త్యమునికి దైవతత్వాన్ని గురించి వివరించి చెప్పారు. అగస్త్యముని అసలు విషయాన్ని అప్పటికి గ్రహించాడు. తాను అనవసరంగా బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, రుద్రుడు వేరు అని అనుకొంటూ ఎదురొచ్చిన దేవతలను తక్కువ చేసి చూసినందుకు చింతించాడు. ఎవరి మనస్సుకు నచ్చిన పద్ధతిని బట్టి వారు ఆయా దేవతలను అర్చించవచ్చు. అంతేకానీ ఈ కనిపిస్తున్న దేవుడు మా దేవుడు కాదు.. అంటూ మన భేదాన్ని సృష్టించటం, ఎదుటి మతాన్ని, ఆ దేవతలను తక్కువ చేసి చూడటం సమంజసం కాదని ఆ మునికి బాగా అర్థమైంది.
ఇప్పటి పరిస్థితులకు అనుగుణముగా మనం ఈ కథను విభిన్నమతాలకు అన్వయించుకోవచ్చు
అంతఃకరణములు
ఎఱుక యొక్క ప్రకాశము వలన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి యొక్క వివేచన రెండు విధములు. 1. అహంకారము 2. మనస్సు. ఆత్మ యొక్క ప్రకాశము వలన తాను స్వయంగా అన్ని విషయాలు గ్రహిస్తుంది. కాని మనస్సు పనిచేసినపుడు దానికి స్వయం ప్రకాశము లేనందు వలన తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది. ఎపుడైతే ఆత్మ మనసు పై ఆధిపత్యము వహిస్తుందో అపుడు తప్పుడు నిర్ణయాలకు అవకాశము ఉండదు. ఆత్మ అంతఃకరణముతో ఏకమైనపుడు బుద్ధి సునిసితమవుతుంది. బుద్ధి యొక్క ఎఱుకలో వ్యక్తి యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది.
బుద్ధి: బుద్ధి అనగా ధీశక్తి లేక వివేకము. ఇది అహంకారము వలన మార్పు చెందుతుంటుంది. రెండవ విషయము జ్ఞాపక శక్తి కూడా మార్పులకు దోహదం చేస్తుంది. బుద్ధికి ఎఱుక తోడైనపుడు విషయ గ్రాహక శక్తి పెరుగుతుంది. ఆ సమయములో అహంకారము, మనస్సు రెండింటి ప్రభావం ఉంటుంది. జ్ఞాపక శక్తి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
మొదటి శ్లోకములో కన్ను మనస్సు ద్వారా విషయాలు గ్రహించినపుడు వాటికి ఆత్మ దర్శన జ్ఞానము లేనందు వలన వాటి గ్రహణశక్తి తక్కువగా ఉంటుంది. అందువలన విషయము పై అనుమానము కలుగుతుంది. ఆ అనుమానము తొలగాలంటే ఎఱు యొక్క అవగాహన వలన వస్తు విషయము స్పష్టమవుతుంది.
పెద్దల అభిప్రాయము ప్రకారము అహంకారముతో కూడిన ఎఱుక ఎటువంటిదంటే: అగ్ని అందు కాల్చబడిన ఇనుపగుండు వంటిది. అలానే అహంకారముతో కూడిన శరీరము గుర్తించిన విషయము అప్పటికే ఎఱుక వలన తెలుసుకొనబడినదై ఉంటుంది. ఆ అహంకారము వలన తెలుసుకొన్న విషయానికి వస్తువే ఆధారము. కాల్చబడిన ఇనుపగుండుకు, అగ్నికి పరస్పర సంబంధము ఉంటుంది. అదే విధముగా అహంకారముతో కూడిన ఎఱుక వలన పూర్తిగా అహంకారము అందులో ప్రతిబింబిస్తుంది. దాన్ని విడదీయుట జరుగదు. అందువలన అహంకారాన్ని వదలినపుడే ఆత్మ సంపూర్ణము. అపుడు వస్తువు యొక్క అసలైన జ్ఞానాన్ని పొందగలుగుతుంది. శరీరము కేవలము జ్ఞానేంద్రియముల ప్రభావము పై ఆధారపడి ఉంటుంది.
అహంకారము పై ఆధారపడిన వస్తువిషేశముల జ్ఞానము నాలుగు విషయములపై నిర్ణయింపబడి ఉంటుంది.
1. అహంకారము 2. ప్రకృతి 3. గతకర్మలు 4. అజ్ఞానము.
1. అహంకారము: వ్యక్తి యొక్క స్వీయానుభవము యొక్క ప్రభావము.
2. ప్రకృతి: వ్యక్తి యొక్క స్వయం అనుభవాల ప్రభావము యొక్క ఎఱుక వస్తువుపై పడుతుంది. అది అతని స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. అందువలనే అహంకారము ''నాకు తెలుసు'' అని చెప్పగలుగుతుంది.
3. గతకర్మలు: వ్యక్తి యొక్క అహంకారము అతని గతకర్మల ఫలితముగా నిర్ణయించబడుతుంది. గతకర్మల ఫలితముగానే వ్యక్తి జన్మముంటుంది. అందువలనే వ్యక్తి తాను ఒక మనిషినని చెప్పగలుగుతాడు. అతనికి ఆత్మానుభవముండదు.
4. అజ్ఞానము: అజ్ఞానము వలన వస్తు విశేషములు గ్రహించుటలో సత్యాసత్యాల ఎఱుక ఉండదు. అందువలన అతని అహము తాను గుర్తించినది అజ్ఞానము వలన అని తెలుసుకొనలేడు. కావున అసలైన సత్యము మరుగున పడుతుంది.
ఈ శ్లోకములో అహంకారము యొక్క ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలో చెప్పబడుతుంది. అహంకారముతో కూడిన ఎఱుక వలన తెలుసుకొనబడిన వస్తు జ్ఞానము నిజమని నమ్మినపుడు దానిని మార్చలేము. కాని కర్మ మరియు నిజమైన ఆత్మ జ్ఞానము పొందినపుడు అహంకారము ద్వారా పొందిన అజ్ఞానము తొలగిపోతుంది.
అహంకారము, తత్‌సంబంధమైన ఎఱుక ద్వారా పొందిన జ్ఞానము పరస్పర సంబంధము కలిగి ఉంటుంది. అది నిజమని నమ్మినంత కాలము మార్పు ఉండదు. అది కేవలము సూర్యుడు నీటిలోని ప్రతిబింబము వలె ఉండును. నీటిని తొలగించినపుడు ప్రతిబింబము తొలగిపోవును. అలానే శరీరము దృశ్యము కూడా అహంకార సంబంధముతో కూడి ఉండును.
కర్మబంధాల కారణము గానే అహంకారము తలెత్తును. శరీరము పై తన ప్రభావమును కర్మ ఫలితములు అనుభవించినంత కాలము ప్రభావము కలిగి ఉండును. తరువాత ఫలితాలను అనుభవించిన వెంటనే ఆ ప్రభావము తొలగిపోవును. గాఢ నిద్రలో కూడా తాత్కాలికంగా కర్మల ప్రభావము ఉండదు.
అహంకారము యొక్క ఎఱుక ప్రభావము ఉన్నంత కాలము చెడు ఫలితములుండును.అవి తొలగిపోవాలంటే జ్ఞానము పొంది ఉండాలి. జ్ఞానము వలన అజ్ఞానము దాని ఫలితములు తొలగిపోవును. అజ్ఞానము యొక్క ఫలితమే అహంకారము. అందువలన అహంకారము కూడా జ్ఞానము వలన తొలగిపోవును. కావున విషయ పరిజ్ఞానము అనగా బ్రహ్మ జ్ఞానము కలిగిన వ్యక్తి యందు అహంకారము ఉండజాలదు. బ్రహ్మ జ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారము.
అహంకారి అయిన వ్యక్తి తమ శరీరమే ప్రాపంచిక బంధనాలకు కారణములని భావించి శరీర బంధనాలలో చిక్కుకుని ఉంటాడు. గాఢ నిద్రలో శరీరము యొక్క అహంకార జ్ఞానము మరుగునపడుతుంది. కలత నిద్రలో శరీరాహంకారముల జ్ఞానము సగము మాత్రమే ఉంటుంది. అదే కలలు కనే సమయము. పూర్తి ఎఱుకలో శారీరక అహంకారము పూర్తిగా ఉంటుంది. గాఢ నిద్రలో తాత్కాలికముగా ప్రాపంచిక వస్తు విశేషములు మరుగున పడును. ఆ సమయములో శారీరక స్పృహ లేకుండును. అహంకారము తొలగిపోవును. గతకర్మల ఫలితాలు కూడా ఉండవు. అనగా ఆ స్థితిలో ప్రాపంచిక శారీరక స్పృహ ఉండదు. శారీరక మానసిక బాధలన్ని మరుగునపడును. అదే దైవ స్థితి.
కలల సమయములో అనగా కలత నిద్రలో భౌతిక శరీర బాధలు లేనప్పటికి మానసికంగా అహం యొక్క స్పృహ కల్గి ఉంటారు. కలల అనుభూతులలో భౌతికంగా వస్తు సముధాయము లేనప్పటికి మానసికంగా వాటి అనుభూతులు ఉంటాయి. అందువలన కలల సమయములో భౌతిక అహం సగం మాత్రమే ఉంటుంది.
ఎఱుక సమయములో బాహ్య వస్తు విషేశములో అంతర్గత ఎఱుక ఉండును. ప్రాపంచిక అనుభవాలు ఈ స్థితిలో పూర్తి అహం యొక్క ఎఱుక లోనే జరుగుచుండును. కలల సమయములో మనస్సు ఒక్కటే పనిచేస్తే, ఎఱుక స్థితిలో మనసుతో అహం మరియు భౌతిక వస్తు అనుభవాలు తోడవుతాయి.
ఎఱుక మరియు కలల సమయములోని మానసిక స్థితులు ఇందు తెలియబడతాయి.
మనస్సు అంతర్గత భాగము ఎఱుకతో ఉండి భౌతిక ఎఱుకలో, కలలలో వివిధ విధాలుగా ఎఱుకతో పనిచేయు చుండును. ఆ సమయంలో అనేక ఊహలు జ్ఞానేంద్రియాల ప్రభావంతో చేయుచుండును.
అంతర్గత విభాగాలలో మనస్సు, వివేకము, అహం మరియు వివిధ మానసిక స్థితుల ప్రభావము ఉంటుంది. అంతర్గత భావనలు అహాన్ని అనుసరించి మరియు ఎఱుక సంబంధమైన పరస్పర అవగాహనతో కూడి ఉండును. మన ఊహలు, మన కలల అనుభవాలను అనుసరించి భౌతిక సంబంధాలను గూర్చి చేస్తుంటాయి. మెలుకవలో కూడా మనము మానసికంగా భావాలతో నిండి ఉంటాము
ఇందులో మనలోని అంతర్గత భావమైన మనస్సును గూర్చి వివరించుట జరుగుతుంది. మనస్సుకు, అహానికి మూలకారణమైన స్థిర ఆత్మ ఏవిధమైన వికారములు లేకుండా ఉండును. ఆ ఆత్మ: మనస్సు, అహంకారము, ప్రకృతిలో సంచరించు చున్నప్పటికి అది మార్పు లేకుండా ఉండును.
స్థిరమైన జీవాత్మను అంతఃకరణమని, లింగమని చెప్పవచ్చు. అదే మనలోని బ్రహ్మాన్ని లేక ఆత్మను తెలుసుకొను మాధ్యమము. ఈ అంతఃకరణమే 17 భాగాలుగా విభజింపబడినట్లు వేదాంతము చెబుతుంది. అవి: 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు, బుద్ధి (వివేకము).
జీవాత్మ (లింగము) అంతఃకరణము రెండూ నిజానికి ఒకటే అయినప్పటికి రెండుగా చెప్పబడుచున్నవి. ఎలానంటే నీరు, ప్రవాహము రెండూ వేరువేరుగా చెప్పబడినప్పటికి రెండూ ఒకటే అయినట్లు. అలానే అగ్ని, ఉష్ణము. ఇవన్నీ కూడా మానసిక జ్ఞానము క్రియల వలె మనస్సు యొక్క చేష్టలు.
అంతఃకరణము అవిధ్య యొక్క ప్రతిబింబము అయినప్పటికి అది ఎఱుక యొక్క అభాస మాత్రమే. పుట్టుక, జీవనము, చావు మొదలగునవి అహంకారము యొక్క వ్యక్తీకరణలే కాని ఆత్మకు సంబంధము లేదు.