రేపటి గెలుపు పిలుపు



మన ఎదురుచూపుల చివరి రోజు రానే వచ్చింది. రేపటినుంచి మరో కొత్త సంవత్సరం మొదలవుతుంది. నిత్యనూతనుడైన సూర్యుడు
కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వస్తాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం ఎదురుచూడటమే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.

అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మా రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహస్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటికోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, రాబోయే నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణమిల్లి వేడుకుందాం.. సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!!

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది బైబిలు. దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది ఖురాన్.

ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వానిద్దాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది