ఈ పూజతో పాపాలు తొలగుతాయి
అష్టమి తిథి బుధవారం నాడు వస్తే దానిని ‘బుధాష్టమి' అంటారు. ఈ జనవరి 22 నాడు అలా కలిసి వచ్చాయి. బుధగ్రహం విజ్ఞత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు సూచన. ఇవన్నీ మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే బుధాష్టమి రోజున..
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్
అని వీలున్నన్నిసార్లు జపించాలి. బుధాష్టమి శివుడికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజని పురాణ వచనం. కాబట్టి ఈ రోజు శివకేశవులను పూజిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది.
గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో బుధాష్టమి వ్రతం చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, బుధగ్రహాన్ని పూజించి, నైవేద్యం సమర్పిస్తారు. ఈ పూజలో బుధుడి రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణేన్ని, దాని ముందు గంగాజల కలశాన్ని ఉంచి పూజ చేస్తారు. వ్రతం పూర్తయ్యాక.. ఆ నాణేన్ని దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ దోషాలుంటే.. వాటి నుంచి విముక్తి లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, కైవల్యం లభిస్తుందనీ విశ్వసిస్తారు.
ఈ రోజున ఉపవాసం ఉండి, దైవారాధన చేసినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందంటారు.