బెంగపడినప్పుడు, భీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి. తల్లి పొదివిపట్టుకుని గట్టిగా కౌగిలించుకుంటేగానీ ఆ భయం దూరమవ్వదు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే. ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ అదమరచి సేదదీరుతాడు. అలాగే నాన్న చెయ్యి పట్టుకుని వేసే తప్పటడుగులు, భుజమెక్కి ఆదే ఆటలు కొండంత అండ తనకుందన్న ధీమానిస్తాయి.
శిష్యుడి శిరస్సును తాకి దీవెనలందిస్తాడు. గురువు. నిండు మనసుతో తలపై చేతిని తాకించినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తిలభించినట్లవుతుంది. గురుస్పర్శలో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురువు ముఖంలో వేదాలు, పాదాల్లో సర్వ తీర్థాలు, కరస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయావృష్టిని కురిపిస్తాయని చెబుతారు పెద్దలు. గురుపాద స్పర్శతో మోహదుఃఖాలు తొలగి జ్ఞానభిక్ష లభిస్తుంది. ఆవిద్య నశిస్తుంది. కేవలం గురుపాద ముద్రను తాకితే జన్మ నివృత్తి, కర్మనివృత్తి
కలుగుతాయని గురుగీత చెబుతుంది
శరీరంలోని ఎనిమిది ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం. భగవంతుడికి భక్తుణ్ని దగ్గర చేసే మార్గం ఇది. మైత్రీబంధం పాదుకొనడానికి, బలపడటానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం. ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది. వివాహక్రతువులో ఒకరి శిరస్సును మరొకరు తాకడం, మెడ, కంటి, హస్త, పాద స్పర్శలు ఆత్మీయతకి చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కలకాలం కలసి జీవించమని ప్రేరణనిస్తూ వారి కుటుంబవృద్ధికి దోహదపడతాయి.
ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం. సున్నితంగా తాకే మలయ మారుత వీచికలు, చల్లని నదీజలాలు, ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవి చంద్రుల కిరణస్పర్శలు, నిబ్బరంగా నిలిచేందుకు భూ స్పర్శ... మనిషి మనుగడకు ప్రాణావసరాలు, ప్రేమానురాగాలు పెల్లుబికినపుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకడమో, బాహుబంధాల్లో బంధించడమో అతి సహజం. సీతాన్వేషణ అనంతరం తియ్యని కబురును అందించిన హనుమను చూసి ఆర్ద్రతతో 'నువ్వు నా మరో సోదరుడివి' అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలచుకున్న మహాపురుషులు సంఘటనలూ పురాణాల్లో ఉన్నాయి. కురు పాండవ యుద్ధానంతరం అవసానదశలో అంపశయ్యను ఆశ్రయించాడు. భీష్మ పితామహుడు. 'బాణాలు తీవ్రంగా బాదిస్తున్నా ఆనందంగా అనుభవించాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును వారించనందుకు తనకు తానే విధించుకున్న శిక్ష ఆది.
కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుటపడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతా పూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపున పుట్టినవారి కనీస బాధ్యత.