సస్య కాంతి సంక్రాంతి



సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక 'ఉత్తర క్రాంతి' అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి పన్నెండు సంక్రాంతులొస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు.

దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోలాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయణం. ఆరోగ్యకారకం, ఆహారసాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మికపూరకమైన విశిష్టకాలమిది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే, ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైంది.

ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందేలు, భోగిమంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్య రాశులు, భోగిపండ్లు- ఇలా సరదాలూ సంతోషాలూ పంచుతుంది.

మామిడాకుల తోరణాలు, పసుపు రాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడితో ప్రతి లోగిలీ ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల ముచ్చటైన పండుగిది. ఈ మూడు రోజుల విశిష్టతను తెలుసుకుంటే సంక్రాంతి శోభ అర్థమవుతుంది.

లక్ష్మీనారాయణులు దీవిస్తారు మహావిష్ణువుకు బదరీవృక్షం (రేగి) ప్రీతికరమైందని, అందుకే ఆ స్వామి బదరికా వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగిపండ్లను చిన్నారుల తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహమూ చేకూరుతుందని విశ్వసిస్తారు. అలా భోగి పండ్లతో లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ప్రత్యక్షంగా అందుతుంది. ఎర్రగా, గుండ్రంగా ఉండే రేగిపండ్లను సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఇవి ఆరోగ్యకారకం కూడా. బొమ్మల కొలువులతో సందడి చేస్తారు. గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభదినం కనుక దేవాలయాల్లో గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరిపిస్తారు.

గాలిపటం.. అంతరార్థం శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుణ్ణి దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మికతకు గుర్తుగా నిలుస్తాయి. భగవదాశీర్వాదం దారంలా నిలబడి మానవుడనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా, తెలియకున్నా గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే. భోగభాగ్యాల భోగి

భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైంది అన్నది పురాణ వచనం. ఈ రోజు ఇంద్రుణ్ణి, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున ఇంటి ముందర, కూడళ్లలో భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకే ఈ ఆచారం, దీని వల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. వాతావరణ కాలుష్యమూ దూరమవుతుంది. యజ్ఞ దేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగిమంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులూ వేస్తారు.

ఆపై అభ్యంగన స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. కొత్తబియ్యం, కొత్తబెల్లంతో పొంగలి వండి భగవంతునికి నివేదిస్తారు.

సంబరాల క్రాంతి

మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. ఈ రోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తయిదువులకు పూలూపండ్లను వాయనంగా ఇస్తారు.

సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరు తీరుగా రూపు దిద్దుకుంటాయి. మధ్యచుక్క సూర్యుడి ప్రతిరూపంగా, చుట్టూ ఉన్నవి గ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. పండుగలో గొబ్బెమ్మలదీ ముఖ్య పాత్రే. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వల్ల నయమవుతాయి.

కనుమ.. పశువుల పండుగ

సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు.

పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి నివేదించి, కొంత పశువులకు తినిపించి, మిగిలినదాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి, గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను వీధుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. 'కనుమ నాడు కాకి కూడా కదలదు' అన్న నానుడి తెలిసిందే కదా! అందుకే ఆరోజు ఏ పనికీ వెళ్లరు, ప్రయాణం కూడా చేయరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది