ప్రేమను పంచిన మహర్షి


పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్థిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమ య్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్దరించాలన్న తాప త్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ధమైన చూపులు, అన్ని జీవరా శులపై కురిపించే దయ మరువలేనివి.

నిరంతరం ఆత్మానందంలో ఓలలా డుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనా తీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్ట నష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ధ చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.

రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా, కూరగాయలు తరుగు తున్నా- సదా సంతోష భరితులై, ఆత్మని ష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్త వానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరి కలు, భావాలు- ఇవే దుర్బలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మ విశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటు వంటి మనసు భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మన సుకు ఆహారం. వాటిని నిలివేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగిన వారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు. అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.

శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది