భారతీయ సంస్కృతిలో ‘అన్నదానం’ ముఖ్యమైనది
క్షుధార్తులకు ఇంత ముద్ద లభించినా అది అమృతంతో సమానం. ముద్ద విలువ
వారికి తెలిసినంతగా మరొకరికి తెలీదు. ఆకలి పదును ఎలా ఉంటుందో తెలిసినవారెవ్వరూ మెతుకును వృథా చేయరు. ‘నీవు తృప్తిగా భుజించు. నీవు వ్యర్థంగా ఆహారం వదిలేస్తే మరొకరికి లేకుండా చేసినట్లే’!
మేఘం వర్షించి, జలధారలతో పుడమిని తడపగా రైతు ఆరుగాలం శ్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసి ధాన్యపురాశిని పండిస్తాడు. భూమాత అందించిన ప్రసాదంగా మనముందుకు ప్రత్యక్షమవుతుంది. ఒక్క ధాన్యపు గింజనైనా వ్యర్థం చేయడం క్షమార్హం కానేకాదు.పట్టెడన్నం కోసం వలసలు పోతూ దుర్భర జీవితం అనుభవించేవారి వెతలు తెలియనివీ కావు.
భగవన్మార్గంలో ప్రయాణించడానికి సాత్వికాహారం ఇలా తోడ్పడుతుంది. త్రికాలజ్ఞులైన మహర్షులు అన్నాన్ని గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నారు. అత్యంత నియమబద్ధ ఆహారాన్నే ఆర్షసంప్రదాయం ఇష్టపడుతుంది. తినడం, తాగడం, నిదురించడం.. మొదలైనవి సర్వప్రాణి సాధారణం అయితే వాటికి మితం ఉండాలి. విశృంఖలత అనర్థాలకు దారితీస్తుంది.
భారతీయ సంస్కృతిలో ఆహార వినిమయంపట్ల ఉన్న ఆచార సంప్రదాయాలు మనకు ఏనాటికైనా శిరోధార్యం! ఆహార వడ్డనకు ముందు ఆనాటి ఆహార పదార్థాలను రవ్వంతగా విస్తరిలో వడ్డిస్తారు. ఎవ్వరికి ఏది ప్రీతిపాత్రంగా ఉంటుందో దాన్నే వడ్డించమని అడిగేటందుకు. అంతేకాదు- క్రమపద్ధతిలో ఏ పదార్థాల తరవాత ఏమేమి తినాలో కూడా సూచిస్తుంది ఈ క్రమం. జిహ్వ రుచులకు, జఠరాగ్ని చల్లబరచే క్రియకు సరైన నియమం ఇది.
భోజనానికి ఉపక్రమించేముందు మనల్ని ఆశ్రయించి ఉండే క్రిమికీటకాదులకు, అల్పప్రాణులకు క్షుద్బాధ లేకుండా ఉండాలన్న సంప్రదాయంతో- ఒక్కముద్ద విస్తరి పక్కనే పెట్టాలన్న నియమమూ ఏర్పరచారు. ధర్మాతిక్రమణ ఆహార విషయంలోనూ పనికిరాదు. క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం- ఆరోగ్యవంతమైన శరీరాన్ని, మనసును ప్రసాదిస్తుంది. ఎంగిలి చేత్తో కాకిని తరమగా- ఆ మెతుకులు విదిల్చిన భాగ్యానికే పుణ్యగతులు సంప్రాప్తమయ్యాయన్న పురాణగాథల్లోని మర్మం ఏమిటి? మెతుకు విలువను తెలియజేయడమే.
ఆకలితో ఉన్నవానికి భగవంతుడు అన్నము నందే కనిపిస్తాడు. అలాంటి వారికి అన్నం పెట్టుట కన్న మోక్షము ఏముటుంది.! అంతకన్న వేరే పుణ్యం ఏముటుంది! అన్నదానం చేస్తే ప్రాణ దేవతలు కూడా తృప్తి చెందుతారు. వారి కోరికలు ఫలిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టుట కనీస మానవ ధర్మం. అన్నదానము ఒక యజ్ఞంగా మనవారు పరిగణించారు. అతిథులకు అన్నదానం చేయట మనుష్య యజ్ఞంగా పేర్కొన్నారు.
న్యాయార్జితమైన కలోగంజో ఏదైనా దాన్ని భగవంతుడికి సమర్పిస్తే అన్న ప్రసాదం అవుతుంది. భగవత్ ప్రసాదం సంతృప్తినీ, సంతోషాన్నీ ఇస్తుంది. దేవాలయాల్లోని ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని భక్తిభావంతో తీసుకుంటాం. భూమాత అందించే ప్రతీగింజ కూడా కళ్ళకద్దుకొనే ప్రసాదమే. అది వ్యర్థంకారాదు.