ఈనాటి మాట
మాంసపుటెముక - మామిడి టెంక - మజ్జిగన్నం కంచం
మాంసాహార ప్రియులైతే మాంసము తినుటకిష్టపడతారు.
అది ఎలా వున్నా పర్లేదు, non-veg అయితే చాలు అనేవారు ఎక్కువే.
మరి మాంసము తినే క్రమంలో
ఎముకలు తినటం బాగా ఇష్టపడతారు మరికొందరు.
అంటే, marrow వున్న ఎముక నములుతుంటే... ఆ తృప్తే వేరు.
అలాగే, ఎముకకు వున్న కండను
లాక్కుని, పీక్కుని తినటంలో ఆనందమే ఆనందం కదా!
అదే విధంగా, మామిడి పండ్లు ఇష్టపడే వారు, బంగినపల్లి తింటారు.
కానీ, రసాలు తినటం తెలిసిన వారెవరైనా మామిడి టెంకను చీకడం, నాకడం మానరు.
ఆ తృప్తే వేరు.
పసుపు రంగు టెంక తెలుపుకొచ్చేవరకు వదలరు.
అలానే, మజ్జిగన్నం మనసారా తినటం తెలిసినవారు
కంచం ఎత్తి త్రాగటం, వేలుతో తుడవటం, ఇంకా ఎన్నో చేయక మానరు కదా!
ఇవన్నీ ఎవరూ ఎవరికీ నేర్పరు.
ఎవరికి వారే ఇష్టము కాబట్టి
శ్రద్ధగా, బుద్ధిగా చేస్తారు.
ఎంతో లీనమై మరీ చేస్తారు.
ఎందుకంటే దానిలో వున్న మజా తెలుసు కాబట్టి.
అలాగే, ప్రతిదీ.
చదువైనా, ఇంట్లో పనైనా
సంస్కారమైనా, సంసారమైనా
పద్ధతైనా, పాడుపనైనా
మర్యాదైనా, అమర్యాదైనా
క్రమశిక్షనైనా, కసాయితనమైనా
బాధ్యతైనా, బడ్డుపనైనా
ఇష్టపడితేనే కష్టమనుకోకుండా
ఖచ్చితంగా నిర్వర్తించగలరు.
కావాలంటే, శాఖాహారులను అడగండి.
వట్టిపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటుంటే అమృతం సేవించినంత తృప్తిగా వుంటుందంటారు.
అందుకే, దేనికైనా ఇష్టమే ప్రధమం.
ఇష్టం శ్రద్ధను పెంచుతుంది.
అపుడు శక్తి వంచన లేని శ్రమ పెట్టుబడౌతుంది.
ఫలితం అంచనాను మించుతుంది.
కనుక, మాంసపుటెముక, మామిడిటెంక, మజ్జిగన్నం కంచం
మనకు మంచి గురువులు.
ప్రాతఃకాల ప్రణామములు