ఏది సత్యం? ఏది అసత్యం?





✍️
మనకు ఏదో సందర్భంలో ‘ఏది సత్యం? ఏది అసత్యం?’ అన్న ధర్మ సందేహం కలుగుతుంది. ప్రతి మనిషికీ అట్లాంటి సమస్య వస్తుంది. ఆ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. విస్మృతిలో కలిసిపోతుంది. అట్లాంటి అనుభవం వల్లే జీవితం ఒక స్వప్నం. ఒక భ్రాంతి, ఒక మాయ అని తెలిసి వస్తుంది. సాధారణ జనం దాన్ని మరిపోతారు. కానీ సత్యాన్వేషకులు ఆ సందేహం దగ్గర ఆగుతారు,దాన్ని పట్టుకుంటారు.
చైనాలో తావో మతం సుప్రసిద్ధం. తావో అంటే మార్గం. అది జీవన మార్గం. సహజంగా అన్నిటికీ ఆమోదం తెలిపే ప్రకృతి మార్గం. లావోట్సు దాని ప్రవక్త. చువాంగ్‌ట్జు ఆయన శిష్యుడు. తావో మార్గాన్ని ప్రచారం చేసినవాడు. చువాంగ్‌ట్జు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆయన దిగులుగా ఉండేవాడు కాడు. ఆయనకు విషాదమంటే ఏమిటో తెలీదు. ఆయన్ని బాధపడుతుండగా ఎవరూ ఎప్పుడూ చూడలేదు.
ఒకరోజు ఆయన తన యింటిముందు దిగులుగా, నిర్లిప్తంగా కూచుని ఉండడం కనిపించింది. ఆయన్ని యిష్టపడేవాళ్ళు, ఆయన స్నేహితులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మనిషి ఎందుకిట్లా నీరసంగా, దిగులుగా ఉన్నాడో వాళ్లకు అర్థం కాలేదు. అంతుబట్టలేదు. పైగా ఆయన ఎప్పుడూ అట్లా లేడు. గతంలో ఎప్పుడయినా ఆయన ఆ రకంగా కనిపించి ఉంటే సరేలే అని వాళ్ళు సర్దుకు పోయేవాళ్ళు. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండే మనిషి ఒక్కసారి దిగులుగా కనిపిస్తే వాళ్ళకు దిక్కుతోచలేదు. అందరూ ఆయన చుట్టూ చేరారు. ఆందోళనతో ఆయన్ని చూశారు. మిత్రుల్లో ఒకతను ‘‘ఎందుకలా ఉన్నావు? ఎప్పుడూ ఇలా లేవు. దిగులన్నది నిన్ను తాకడం మేము చూడనే లేదు. ఎప్పుడు గలగలలాడుతూ, నవ్వుతూ... నవ్విస్తూ ఉండేవాడివి, హఠాత్తుగా ఎందుకింత వౌనంగా, ఉదాసీనంగా, గంభీరంగా మారిపోయావు? ఏం జరిగింది? మాకు చెప్పు. చెప్పనిదే మాకు తెలిసే అవకాశం లేదుకదా!’’ అన్నాడు. ఏం చెబుతాడో అని అందరూ ఆసక్తిగా చూశారు.
చువాంగ్‌ట్జు అందర్నీ చూసి ‘‘ఆందోళన పడకండి. అందరూ కూచోండి. జరిగింది వివరిస్తాను. అంతా చెబుతాను. నాకో పెద్ద సమస్య వచ్చి పడింది. అది పెద్ద ధర్మ సందేహం. నేనెంతగా జుత్తు పీక్కున్నా నాకు దానికి సమాధానం దొరకలేదు. అందుకే దిగులుగా ఉన్నాను. ఒకవేళ మీ కెవరికయినా దానికి సమాధానం దొరికి చెప్పారంటే మీకు రుణపడి ఉంటాను’’ అన్నాడు. మిత్రులు ‘‘సరే! ప్రయత్నిస్తాం. మొదట సమస్య ఏమిటో చెప్పు’’ అన్నారు. ‘‘రాత్రి నాకొక కలవచ్చింది. ఆ కలలో నేనొక సీతకోక చిలుకపై తోటలో తిరుగుతూ ఉన్నాను. ఆ తోటలో అందమయిన పూల చెట్లున్నాయి. నేను ఒక్కో పువ్వుమీదా వాలుతూ ఉల్లాసంగా తిరుగుతూ వెళుతున్నాను’’ అన్నాడు.
మిత్రులు ‘‘ఇక్కడ సమస్య ఏముంది? నీకు కలవచ్చింది. కలలో నువ్వు సీతాకోక చిలుకవయ్యావు. పూలమీద తిరుగుతున్నావు. కల రావడం ఎవరికయినా సహజం. ఇక్కడ అంతగా ఆందోళన పడవలసిన విషయమేముంది?’’ అన్నారు. చువాంగ్‌ట్జు ‘‘సమస్య అది కాదు. అప్పుడు సమస్య లేదు. ఎప్పుడయితే నాకు మెలకువ వచ్చిందో అప్పుడు సమస్య మొదలయింది. నాకు మెలకువ వస్తూనే నాకో సందేహం కలిగింది. నేను నిద్రపోతున్నప్పుడు కలలో నేను సీతాకోక చిలుక నయ్యాను. అంటే అప్పుడు నేను లేను. ఇప్పుడు మేలు కొన్నాను. ఇప్పుడు సీతాకోక చిలుక లేదు. నేనున్నాను. నేను సీతాకోక చిలుకగా కలలో మారాను. ఇప్పుడు మనిషిని. దీనివల్ల సందేహం కలిగింది. నేను సీతాకోక చిలుకను కలగన్నప్పుడు మనిషినా? లేదా ఇప్పుడు మనిషినా? కలగన్న సీతాకోక చిలుకనా? అంతుపట్టక దిగులుగా ఉన్నాను’’ అన్నాడు. చువాంగ్‌ట్జు చెప్పింది నిజం. కళ్ళు మూసుకుంటే బయట ఉన్నది అదృశ్యమవుతుంది. కళ్ళు తెరిస్తే లోపల ఉన్నది కనిపించదు. ఏది స్వప్నమో, ఏది వాస్తవమెలా చెబుతాం? స్వప్నం వాస్తవంలో లీనమవుతుంది. వాస్తవం స్వప్నంలో కరిగిపోతుంది. ఏది యథార్థమంటాం? ఏది సత్యమంటాం? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? రహస్యానికి తలవంచడం తప్ప చేయలగింది లేదు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది