👍 ప్రతి సర్కారు బడిలో ఈయన కథను నోటీసు బోర్డులో అతికించాలి
ప్రతి పిల్లవాడికీ చెప్పి స్ఫూర్తిని నింపాలి. తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికీ ఈ కథ చెప్పి ఆత్మన్యూనతను తొలగించాలి. వారిలో పట్టుదలను, కసిని, జ్ఞానతృష్ణను పెంచాలి. ఎవరైతే సర్కారు బడిలో చదవడం దండుగ అంటాడో తనకు ఈ ఫోటో చూపించాలి. తెలుగు మీడియం పనికిరాదన్న ప్రతివాడినీ రోణంకి గోపాలకృష్ణ తెలుసా అనడగాలి.
ఎందుకు..? ఎందుకు..? ‘ముచ్చట’ మనస్పూర్తిగా అభినందిస్తూ, ప్రశంసిస్తూ చెబుతున్న ఓ రియల్ సక్సెస్ స్టోరీ ఇది. కృత్రిమమైన విజయగాథలకు భిన్నంగా, చీత్కారాలు, ఎగతాళి వ్యాఖ్యల నడుమ సివిల్స్ థర్డ్ ర్యాంకును కొట్టేసిన ఈ సిక్కోలు మణిపూస కథ ఇది. ఎందుకంటే ఈ ర్యాంకు సాధన మనకు చాలా చాలా పాఠాలు చెబుతున్నది గనుక…!
ఈయన పేరు రోణంకి గోపాలకృష్ణ. తల్లీ తండ్రీ ఇద్దరూ వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు. ఊరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం, పారసంబ. వీథిబడిలోనే స్కూల్ చదువు, ఇంటర్ దాకా తెలుగు మీడియం. డిగ్రీ చేసింది ఆంధ్రా యూనివర్శిటీ దూరవిద్యలో. ప్రతిభకు కులం ఉండదు, పేదరికం ఉండదు, ప్రాంతం ఉండదు. మనిషిలో ఎదగాలనే కసి ఉండాలే గానీ ఏదీ అడ్డురాదు అని చెప్పేందుకు ఉదాహరణ తను. ఉపాధ్యాయ శిక్షణ పొందాక 2007లోనే టీచర్ అయ్యాడు. అదే మండలంలోని రేగులపాడులో సర్కారీ టీచర్.
*2006 నుంచి సివిల్స్ కోసం పోరాటం…*
2012లోనే గ్రూపు-1 ఇంటర్వ్యూల దాకా వెళ్లాడు. చివరకు గోల్ కొట్టాడు. అదీ జాతీయ స్థాయిలో థర్డ్ ర్యాంకు… అదీ అల్లాటప్పా కాదు. ఎలాగంటే..?
ఓ సాదాసీదా కూలీ కుటుంబం, కాసింత పొలం. చదివింది తెలుగు మీడియం, సర్కారు బడి. పైగా డిగ్రీయేమో దూరవిద్య, వెనుకబడిన జిల్లా, ఇప్పటికీ తన ఊరికి న్యూస్ పేపర్ రాదు.
తను సర్కారు బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు, గుడ్డి దీపాలే. తన సివిల్స్ కోరిక విని అడ్మిషన్స్ ఇవ్వటానికే నిరాకరించాయి. హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లు మొహం మీదే నవ్వి వెక్కిరించారు. వాటి నడుమ తనలో పట్టుదల మరింత పెరిగింది. ఏకంగా తెలుగులో మెయిన్స్, తెలుగు లిటరేచర్ ఆప్షనల్, తెలుగులో ఇంటర్వ్యూ, మొత్తం తెలుగే చూడండి.
ఎన్నిరకాల ప్రతికూలతలు, అయితేనేం పదకొండేళ్ల ఆ పోరాటానికి చివరకు ఆ సివిల్స్ శిఖరం తనే వంగి సెల్యూట్ కొట్టింది. ఆ కుటుంబం సామాజికంగానూ ఇక్కట్లు పడింది. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం తండ్రి ఎవరో నిమ్నకులస్తుడి ఇంట్లో భోంచేసినందుకు చుట్టాలు, ఊరోళ్లు దాదాపు వెలివేశారు. ఎవరూ మాట్లాడరు. అదో శిక్ష బాగా సాధన సంపత్తి ఉండి, విద్యావాతావరణంలోనే పెరిగి, అత్యుత్తమ కోచింగ్ తీసుకుని సివిల్స్ కొట్టినవాళ్లు, ర్యాంకులు పొందినవాళ్లకన్నా ఇలాంటి వ్యక్తులు సాధించిన ర్యాంకులకే విలువ ఎక్కువ.
ఎందుకంటే, ఈ ర్యాంకుకు కన్నీటి రుచి ఉంది. మట్టి వాసన ఉంది. చీత్కారాల రంగు ఉంది. అన్నింటికీమించి తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ, సర్కారు బళ్లు మూసేస్తున్న ఇప్పటి దుస్థితిలో ప్రతి సర్కారు బడి విద్యార్థి, ప్రతి తెలుగు మీడియం విద్యార్థి తల ఎత్తుకుని చెప్పుకోగలిగేది ఈ కథ. అందుకే ఇదీ రియల్ సక్సెస్ స్టోరీ.
_*కంగ్రాట్స్ గోపాలకృష్ణా…*_