మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట





శ్రీ త్యాగరాజ స్వామి

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు ప్రాతఃస్మరణీయులు, సద్గురువు, వాగ్గేయకారులు, సంగీతత్రయములో ఒకరైన శ్రీ త్యాగరాజ స్వామివారి అచంచలమైన భక్తిని గురించి వివరించిన విశేషములు, త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవము సందర్భముగా

త్యాగరాజస్వామి గృహస్థాశ్రమములో తరించి, చిట్టచివరలో సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించినటువంటివారు. "భక్తి" అనేటటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనముగా నిలబడినటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి సంబంధించినంతవరకూ "భక్తి" అంటే కేవలము అరగంటసేపో, గంటసేపో పూజామందిరములో ప్రవేశించి భగవంతుడి దగ్గర కూర్చుని బయటకి వచ్చేసేటటువంటి ప్రక్రియ కాదు. ఆయన ఊపిరి ఉన్నంతవరకూ భగవంతుడితో అనుసంధానము అవుతూనే ఉన్నారు. విగ్రహారాధన అనేటటువంటిది కేవలము విగ్రహమునకు పూజ చెయ్యడము ఒక్కటే కాదు. మనము ఆ విగ్రహము భగవంతుడే అన్న భావనతో పూజ చెయ్యగలిగితే భగవత్‌ స్వరూపము ఆ మూర్తి ద్వారా మనల్ని ఎలా అనుగ్రహిస్తుంది అన్నది మనకి నిదర్శనముగా చూపించినటువంటివారు త్యాగరాజస్వామి. సీతారాములు ఇద్దరూ వేరు కాదు, సీతారాములు ఒక్కటే. అటువంటి సీతారాములతో కూడి ఉన్నటువంటి లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమలతో(రామ పంచాయతనము అంటారు) కూడిన శ్రీరామ పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆయనకి సంబంధించినంతవరకూ అవి విగ్రహాలు కావు. అవి చెయ్యి తగిలినా, క్రింద పడిపోయినా, వాటి మీద ధూళిపట్టినా "అవి విగ్రహాలు" అన్న భావనతో ఆయన ఏనాడూ ప్రవర్తించలేదు. "సాక్షాత్తూ ఇంట్లో సీతారామచంద్రమూర్తి ఉన్నారు, ఆయనను సేవిస్తూ ఆయన చుట్టూ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమ ఉన్నారు" అన్న భావనతోనే ఆయన జీవించారు. అలా జీవించారు కాబట్టే విగ్రహాలుగా అవి ఆయనకి మిగలలేదు, సాక్షాత్తూ భగవత్‌ స్వరూపాలుగానే నిలబడ్డాయి.

సర్వసాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు నాబోటివాడయితే "ఇది తిరుపతి నుండి తీసుకువచ్చిన విగ్రహం, ఇది నేను కాశీ పట్టణము నుండి తీసుకువచ్చిన విగ్రహము, ఇది నేను జంబుకేశ్వరము నుండి తీసుకువచ్చిన విగ్రహము" అని దానిని "విగ్రహము","విగ్రహము" అని మాట్లాడతాము. కానీ త్యాగరాజ స్వామి దృష్టిలో విగ్రహాలు కావు. అందుకే ఆస్తి పంపకము జరిగినప్పుడు ఆయన తనకి ఇంట్లో ఎక్కువ భాగము రావాలి అని కోరుకోవడం కన్నా, ఆయన తండ్రిగారు, పూర్వీకులు పూజ చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క సంపుటము ఏది ఉన్నదో, అది నాకు కావాలి అని కోరుకుని ఆ పూజా సంపుటానికి పూజ చేసారు.

ఒకప్పుడు తోడబుట్టిన అన్నగారు ఆ విగ్రహాలను తీసుకుని వెళ్లి కావేరీ నదిలో పారేసాడు. "అస్తమానూ ఈ విగ్రహాలను పూజ చేస్తూ కూర్చుంటాడు, మహారాజులు వచ్చి ఆదరించి కానుకలు ఇచ్చినా కూడా స్వీకరించడు, ఈ విగ్రహాలు తీసుకునివెళ్లి ఎక్కడైనా పారెస్తే ఈ వ్యామోహము వదిలిపోయి తదనంతరము సంపాదన మీదకి కొంత దృష్టి మరలుతుందేమో" అనేటటువంటి స్వార్ధముతోటి, "తమ్ముడు సంపాదిస్తే తాను కూడా కొంతభాగము అనుభవించవచ్చు" అనేటటువంటి అభిప్రాయముతోటి విగ్రహాలను తీసుకుని వెళ్లి కావేరీ నదిలో పారేసాడు. త్యాగరాజస్వామికి సంబంధించినంతవరకూ అవి విగ్రహాలు కావు, సాక్షాత్తూ సీతారాములే. "ఇవి పోతే ఇంకొకటి పెట్టుకోవచ్చులెద్దూ" అన్న భావన ఆయనకి లేదు. "సీతారాములు లక్ష్మణ,భరత,శత్రుఘ్న,హనుమలతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లోనుండి వెళ్లిపోయిన తర్వాత ఇంక నేను ఉండి ప్రయోజనం ఏమిటి" అన్న ఉద్దేశముతో ఆయన మూడు రోజులు ఉపవసించారు. ఏ పదార్థం ముట్టుకోలేదు. రామదర్శనము కోసమని పరితపించి కావేరీ నదీ తీరంలో నిలబడి కీర్తన చేస్తూ ఉంటే లోకములో చెప్పబడేటటువంటి సూత్రములకు విరుద్ధంగా ఆయన పూజ చేసినటువంటి పంచాయతనానికి సంబంధించిన మూర్తులు కావేరీనది నీటి మీద తేలుతూ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ వచ్చిన మూర్తులను మళ్ళీ తీసుకునివెళ్లి ఆయన ఇంట్లో పెట్టి ఆయన ఆరాధన చేసారు. వాటిని ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు కూడా ఆయన కేవలం ఏదో విగ్రహాలని తీసుకొస్తున్నాను అన్న భావనతో తీసుకుని రాలేదు."రారా మాఇంటిదాకా" అని కీర్తన పాడుతూ తీసుకుని వచ్చారు. ఆయనకి ఆ రాముడితోడిదే ప్రపంచము. "ఇంట్లో రాముడు ఉన్నాడు, నాతో రాముడు ఉన్నాడు, నన్ను నిరంతరము రాముడు గమనిస్తూ ఉంటాడు, నన్ను రాముడు కాపాడుతుంటాడు.ఆ రామచంద్ర మూర్తి యొక్క అనుగ్రహము కన్నా ఇతరుల యొక్క అనుగ్రహం, ఇతరులు ఇచ్చేటువంటి కానుకలు గొప్పవి కావు" అని పరిపూర్ణముగా విశ్వసించినటువంటి మహాపురుషుడు త్యాగరాజస్వామి.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది