బిక్కుబిక్కుమంటూ ఎప్పుడూ బతక్కు... అది బతుకే కాదు. నీ ఒంట్లో శక్తి ఉంది.. ఒళ్లొంచి కష్టపడగలవు.. అనుకుంటే ఏదైనా సాధించగలవు.. ఇంకెందుకు బిక్కుబిక్కుమనాలి? దేన్ని చూసి భయపడాలి?
నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అందరూ భయపెట్టేస్తారు... చివరకు బయటకు వెళ్తుంటే సడన్గా పడే ఓ చిన్న వర్షం కూడా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదీ ఆలోచించకు, ఏదైనా చెయ్యాలంటే చేసేయ్. ఫలానా పని చేస్తే ఎవరేమనుకుంటారో అని ఎవరి వైపు దిక్కులు చూడకు.. నీ లైఫ్ నీది, నీ గమ్యం నీది, నీ నిర్ణయం నీది. నీ లైఫ్లో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇతరులకు ఇవ్వకు. ఫుట్బాల్ ఆడుకుని నిన్ను అటూ ఇటూ కాకుండా తయారు చేస్తారు.
నువ్వు చేసేది తప్పైనా, ఒప్పైనా చేసేయి.. తప్పు చేస్తే అనుభవం వస్తుంది, ఒప్పు చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. నష్టమేం లేదు. అంతే గానీ భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ ఏ పనీ చెయ్యకుండా బద్ధకంగా బెడ్ మీద దొర్లాడకు.
ఈ క్షణం శ్వాస తీసుకోగలుగుతున్నావంటే, నువ్వు ఇంకా బతికి ఉన్నావంటే చాలా అదృష్టం చేసుకుని ఉన్నట్లు లెక్క. తిండీ, నిద్రా లాంటి జంతు సమానమైన పనులతోనే నీ జీవితాన్ని ముగించకు. నీ జీవితానికో పర్పస్ ఉంది. దాన్ని గుర్తించు.. కష్టపడు.. నిన్ను చూసి నీకు ముచ్చటేయాలి గానీ ఏమీ సాధించలేకపోతున్నందుకు నీపై నీకు అసహ్యం వెయ్యకూడదు.
ఒక్కటి గుర్తు పెట్టుకో... అప్పుడెప్పుడో రాశాను.. ప్రతీ మనిషి లైఫ్లో ఓ ఐదేళ్లు కీలకమని! నిన్న తేజ "నువ్వే రాజు నువ్వే మంత్రి" సినిమా చూస్తుంటే అలాంటిదే ఓ డైలాగ్ ఉంది... ఐదేళ్లలో CM కుర్చీ నా సీట్ కింద ఉండాలని"! యెస్... ఏ జీవితానికైనా ఐదేళ్లు చాలు 0 నుండి హీరో కావడానికి.. ఒక్క ఐదేళ్లు కళ్లు మూసుకుని కష్టపడు, ఆ తర్వాత నువ్వే స్థాయికి ఎదుగుతావో నువ్వు కూడా ఊహించలేవు. ఇది పక్కా రాసి పెట్టుకో. కావాలంటే ప్రింట్ తీసి పెట్టు.