భగవంతుడు .
భగవంతుడు సర్వాంతర్యామి .నిరాకారుడు
' ఈ విశ్వమంతా నాలో ఒక్క రేణువు ' అని
భగవద్గీతలో భగవానుడు పేర్కొన్నాడు .అంటే భగవంతుడునుంచి ఓ
రేణువు విడిపోయి ,విశ్వంగా రూపుదాల్చింది అని అర్ధంకాదు .దైవం ఒక విరాట్ శక్తిస్వరూపమైతే ,ఆ శక్తిలోని ఓ పార్శ్యం విశ్వంగా అవతరించింది .నేను అన్ని ప్రాణుల
హృదయాలలో ఉంటాను .ప్రాణుల ఆదిమధ్యాంతాలు నేనే ! అని గీతాచార్యుడు
పలికాడు .మనం వ్యక్తులమని ,విశ్వానికి అవతల ఎక్కడో సుదూరంగా భగవంతుడున్నాడని ,అతనిని భక్తిశ్రద్ధలతో కొలిచి ఘనంగా నైవేద్యాలు సమర్పిస్తే అతను మనకోసం దిగివచ్చి వరాలిస్తాడని భావిస్తాం .
కానీ అదంతా వట్టి భ్రమ .మనలో ఉన్న ఆత్మే భగవంతుడు .అంతర్గతంగా ఉన్న భగవంతుని గుర్తించలేక ,ఎక్కడెక్కడో అతనికోసం వెదుక్కుంటూ ,వృధాగా కాలక్షేపం చేస్తూ చివరికి ఎమీ సాధించలేకుండానే జీవితాన్ని ముగిస్తున్నాం .
అంతరాత్మగా ఉన్న అంతర్యామిని ముందుగా గ్రహించాలి .' నేను నేనైన నేను ' అని బైబిల్ భగవంతునిగూర్చి ఉత్తమముగా
నిర్వచించింది .ఈ గ్రంధంలో జెహోవా అన్న పదానికి ' అహం ' అని అర్థం .అంటే భగవంతుడు ఎవరోకాదు ' అత్మే ' అని బైబిల్
కూడా చెబుతుంది .దేహమే దేవాలయం .ఈ శరీరమే భగవంతుని దివ్య ఆవాసం .ప్రాపంచిక విషయాలకు అధిక ప్రాధాన్యము ఇవ్వడం వల్ల మనలోనున్న దైవాన్ని గుర్తించలేకపోతున్నాం .లక్ష్య శుద్ధితో అన్వేషిస్తే పరంజ్యోతిగా దర్శనమిస్తాడు .
అది తెలుసుకొవడమే భావనాతీత సద్భావస్థితి .