నలుగురికి నేను చెప్పేదేమిటoటే

పోకిరీల ఆలోచనలు విపరీతంగానే ఉంటాయి. ఆడదాని శరీరంలో ఏ భాగాన్ని చూసినా మగతనాన్ని రెచ్చగొడుతున్నట్లే వెర్రెత్తిపోతారు. అది మర్మస్థానం కాదు, నీ జన్మ స్థానం అని విడమరచి చెప్పినా వినిపించుకోరు. ఆ అవయవాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధుల గురించి మాట్లాడుకునేటపుడైనా వికారపు మాటలకు కళ్ళెం వేయలేరు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా ఇకఇకలు పకపకలతో పిచ్చి ఆనందం పొందుతారు. ఇలాంటి విద్యార్థులు కొందరిని ఓ పాకిస్థానీ యూనివర్సిటీ విద్యార్థిని స్వయంగా చూసింది. బ్రెస్ట్ క్యాన్సర్‌ గురించి ఇంత నీచంగా మాట్లాడుకుంటారా? అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా తన మనోభావాలను ప్రపంచంతో పంచుకుంది.

పాకిస్థాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఫమా హసన్ చదువుతోంది. ఓ రోజు ఆమె క్లాస్ రూం నుంచి కారు దగ్గరికి నడుస్తోంది. ఆ దారిలో కొందరు విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా వాళ్ళ మాటలు ఆమె చెవిలో పడ్డాయట. బ్రెస్ట్ క్యాన్సర్ అన్న పదాల్లో బ్రెస్ట్ అనే మాటను ఒత్తి పలుకుతూ, రకరకాల వ్యాఖ్యానాలతో, జోకులతో వెర్రెత్తిపోయారట. ఆ వాగుడును ఆమె భరించలేకపోయిందట. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలనుకుందట. ఇలాంటివాళ్ళందరికీ ఇదే సమాధనం అంటూ ఫేస్‌బుక్‌లో ఇలా రాసింది….

యూనివర్సిటీ నుంచి ఇంటికెళ్ళే వరకు క్రుంగిపోయాను. మనిషి మౌలిక అవయవాలు ఏ స్థాయిలో కామ ప్రేరేపితాలయ్యాయంటే వాటికి సంబంధించిన కేన్సర్ వచ్చినా ఈ కుర్రాళ్ళ కుళ్ళు జోకులకు కేంద్రాలుగా మారుతున్నాయి. మనం మాట్లాడుకుంటున్న ట్రంప్‌లాంటివాళ్ళు వీళ్ళంతా. కేవలం పాకిస్థాన్‌లోనే బ్రెస్ట్ కేన్సర్ వల్ల ఏటా సుమారు 40 వేల మంది మరణిస్తున్నారని వీళ్ళకు తెలుసా? బయటపడి చెప్పుకోగలిగినవారినే ఈ లెక్కల్లో నమోదు చేశారు. ఆసియాలోనే అత్యధికంగా పాకిస్థాన్‌లో బ్రెస్ట్ కేన్సర్ పీడితులు ఉన్నట్లు వీళ్ళకు తెలుసా? ఇటువంటి సామాజిక పరిస్థితుల వల్లనే మహిళలు మెడికల్ చెకప్స్‌కు దూరమవుతున్నారు. వాళ్ళ బాధలను, సమస్యలను కనీసం కుటుంబ సభ్యులతోనైనా చెప్పుకోలేకపోతున్నారు. చిట్టచివరి దశలోనే రోగ నిర్ధారణ జరుగుతుండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
కూర్చొని మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదని నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. అందువల్ల మీరంతా ఇటువంటి సమస్యలపై ఇతరులకు అవగాహన కల్పించాలి. అందుకోసం ఏదో ఒకటి చేయాలి. ఇన్‌స్టిట్యూషన్లకు స్వచ్ఛంద సంస్థలవారు వచ్చినపుడు ఇలాంటి నిరక్షరాస్యులకు చెప్పవలసిన విధంగా చెప్తారు.

నా చెవులకు వినిపించేలా మాట్లాడిన నలుగురికి నేను చెప్పేదేమిటంటే… మీరు వివరాలు తెలుసుకోండి. మీ చుట్టుపక్కలవాళ్ళకి తెలియజేయండి. ఆడదాని శరీరం కేవలం వస్తువు కాదు. మేము నిజమైన మనుషులం, మాకు నిజమైన రోగాలు వస్తాయి. మీ పోర్న్ ఎడిక్షన్ మీకు మరోలా నేర్పినట్లుంది, గాడ్ బ్లెస్’’.
ఈ పోస్ట్ చదివినవాళ్ళంతా ఫమాను ప్రశంసిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది