చంద్రవంశ విస్తరణ-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌸🌸🌼🌼🌸🌸🌺🌺
Part 23
చంద్రునికి బుధోత్పత్తి
ఇక చంద్రవంశపు రాజుల ప్రస్తావన. నారాయణుని నాభినుంచి పుట్టిన బ్రహ్మకు పుత్రుడు అత్రిమహర్షి. వీరి కుమారుడే చంద్రుడు. ఇతడు తనకున్న ఆధిపత్యం చేత, చక్కదనం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. దేవతలు వెంటరాగా ఇంద్రుడు చంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. దానవులు చంద్రునికి సహాయం చేయడంతో దేవతలు వెనుదిరగక తప్పలేదు. శంకరుని ప్రమేయంతో తార తిరిగి బృహస్పతి ఇంట చేరింది. అప్పటికే ఆమె గర్భవతి.
అతడు బృహస్పతికి పుట్టినవాడో - చంద్రునికి పుట్టినవాడో తెలుసుకోగోరిన దేవతలు, బ్రహ్మ సహాయంతో ఆమె చేత నిజం పలికించారు. అతడు చంద్రునికి పుట్టినవాడే అని రూఢి అయింది. చంద్రుడాతనికి బుధుడని పేరు పెట్టాడు. ఈ బుధునికి సుద్యుమ్నుడు ఇళ రూప స్త్రీ దేహంతో ఉండగా పురూరవుడు జన్మించాడని ఇంతకుముందే చెప్పబడింది కదా!
ఒకప్పుడు దేవేంద్ర శాపంచేత ఊర్వశికి మానుషలోక నివాసం తప్పని సరైంది. ఆ సమయంలోనే పురూరవ చక్రవర్తి ఆమెను చూడటం తటస్థించింది. ఆమె కూడ పురూరవుని వలచి, రెండు నియమాలకు కట్టుబడితే తానా చక్రవర్తిని సుఖపెట్టగలనని షరతు పెట్టింది. తానెంతో ప్రేమగా చూసుకునే మేక పిల్లలు ఆమెతోనే నిరంతరం ఉండాలి. రెండోది పురూరవుని ఆమె నగ్నునిగా చూడకూడదు. సరే అన్నాడాచక్రవర్తి.
ఆమెతోగూడ పురూవర చక్రవర్తి పలువిధములైన ఉద్యానవనాలు - ఉపవనాలు, సరస్సులతీరాలు, తదితర రమణీయ ప్రదేశాల్లో విహరిస్తూ 61 సంవత్సరాల కాలాన్ని ఇట్టే గడిపేశాడు. రసభరితులై వారిద్దరూ గావించిన క్రీడావిళాసాలలో ఊర్వశికి కూడా అతనిపై అనురాగం జనించి స్వర్గం మాటనే మరచిపోయింది.
ఊర్వశి లేని లోటు స్పష్టంగా దేవసభలో కనిపిస్తుండటంతో ఇంద్రుడామెను తిరిగి అమరలోకానికి రప్పించడానికి విశ్వావసుడనే ఒక గంధర్వుని నియమించాడు. అతడికి ఊర్వశీపురూరవుల ఒడంబడికలో తేడా ఏర్పడితే తప్ప, ఆమెను స్వర్గలోకానికి గొనిపోవడం కల్లని తెలిసిపోయింది.
ఊర్వశికి పురూరవుడిచ్చిన వాద్గానానికి భంగం జరిగేలాగ విశ్వావసువు మాయారూపుడై వచ్చి, ఒకనాటి రేయి ఊర్వశీ పురూరవులు రతి సుఖంలో ఉండగా మేకపిల్లలను మాయంచేశాడు. అవి శయ్యామందిరం వెలుపలనుంచి దీనంగా అరుస్తూండడంతో పురూరవుని చూసి రమ్మంది ఊర్వశి. దిగంబరునిగా ఉండడంచేత, పురూరవుడు ఊర్వశి తననెక్కడ వదలిపోతుందోనని తటపటాయించసాగాడు. మేకపిల్లలు మరీ దీనంగా అరిచేలా చేశాడు విశ్వావసువు. ఇక నగ్నంగా ఆమెకు కనబడక తప్పలేదు పురూరవునికి. వాగ్దానభంగం జరిగింది కనుక, ఊర్వశి వెళ్లిపోతూ, "నీకొక కుమాఅరుని, దీర్ఘాయుష్మంతుని ఏడాది తర్వాత ఇస్తాను" అని చెప్పింది.
ఊర్వశినే సంకల్పంచేస్తూ త్రేతాగ్నులను ఆమ్నాయానుసారిగా హోమం చేశాడు పురూరవుడు. (ఊర్వశీ సాలోక్యం ఫలితంగా చెప్పుకున్నాడన్నమాట!) అతడికా ఫలితం లభించింది. ఎన్నో యజ్ఞాలు నిర్వర్తించిన ఆ చక్రవర్తి చివరకు గాంధర్వలోకంలో ఊర్వశిని తిరిగి చేరుకున్నాడు. త్రేతాగ్నులుగా అగ్ని ప్రవర్తిల్లినదీ పురురవుని వల్లనే!
చంద్రవంశ విస్తరణ
ఆ పురూరవ వంశం విస్తరించిందిలా....పురూరవుడునకు ఆయువు - అమావసువు - విశ్వావసువు - శ్రుతాయువు - శతాయువు - అయుతాయువు అనే ఆరుగురు కొడుకులు.
ఇందులో - అమావసువునకు భీముడు, అతనికి కాంచనుడు, అతడికి సుహోత్రుడు ఉదయించారు.
సుహోత్రుని కొడుకు జహ్నువు. యజ్ఞం చేస్తూండగా ఈతని యజ్ఞవాటికను గంగ ముంచెత్తి వేసిందన్న ఆగ్రహంచేత ఈ రాజర్షి గంగను మొత్తం త్రాగేశాడు. దేవర్షులు ఇతడ్ని బుజ్జగించి, గంగ నీకు కూతురు వంటిది. విడిచిపెట్టు అని కోరగా అతను గంగను విడుచుట చేత జాహ్నవి అయిందానది.
జాహ్నువు కొడుకు సుమంతుడు...ఇలా ఈ వంశంలోని ఇతర ప్రముఖులలో గాధి, ఋచికుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, పరశురాముడు, శునశ్శేపుడు మొదలగువారు. వీరి చారిత్రములన్నీ గొప్ప అద్భుతములు.
'రజి' వంశ చరిత్ర
పురూరవుని పెద్దకొడుకు ఆయువు. రాహువు (గ్రహంకాదు) అనువాని కూతురు ఇందిరను పెండ్లాడి ఆమెయందు ఐదుగురు పుత్రులనుకన్నాడు. వారే నహుషుడు, క్షత్రవృధుడు, రంభుడు, రజి, అనీనసుడు. విరికి వివాహాలు జరిగి, వీరి వంశాలు కూడా అగణితంగా విస్తరించాయి.
కొన్నివేల ఏళ్లపాటు, వేలవేల క్షత్రియవీరులకు వంశపరంపరాగతంగా వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్ల, ఆయా వంశాలలో కొందరి చరిత్రలే అధ్యయనానికి గ్రహించబడతాయి. అందరి చరిత్రలూ రాయబడటం వ్యాసునికైనా అసాధ్యమే!) ఉదాహరణకు 'రజి' అనేవాడికి అసమాన బలవీర్యసంపన్నులైన ఐదువందల మంది పుత్రులున్నారు. దేవాసుర సంగ్రామవేళ, రజిని తమవైపు పోరాడవలసిందని ఇటు దైత్యులు, అటు అదితేయులు కూడా కోరారు. అందుక్కారణం - అతడెటువైపుంటే అటు విజయం తథ్యం. రజి దేవతలవైపే మొగ్గు చూఫాడు.
దేవతలు రజికి ఇంద్రపదవి ఇవ్వడానికి అంగీకరించారు. దాంతో అతడు రాక్షసులను జయించడంలో దేవతలకు బాగా సాయం చేశాడు. విజయం లభించాక, ఇంద్రుడు స్వయంగా రజి వద్దకు వెళ్లి, తనను పుత్రసమానుడిగా భావించమనికోరాడు. "సరే! ఇంద్రుడిగా ఉండి, ఆ స్వర్గపట్టణాన్ని నువ్వే ఏలుకో పొమ్ము" అన్నాడు రజి.
ఈలోగా నారదుడు రజి పుత్రులను రెచ్చగొట్టాడు. దేవతలది ఎంతో ముందుచూపుతో కూడిన కుతంత్రం అన్నాడు. దేవేంద్రుని దగ్గరకెళ్ళి మాటప్రకారం, తమ తండ్రి సంపాదించిన స్వర్గరాజ్యం తమకు ఇమ్మన్నారు. అది జరిగేది కాదని తేలగానే, దేవేంద్రుని పదవీచ్యుతుని గావించి సింహాసనం ఆక్రమించారు.
ఇంద్రుడు బృహస్పతికి తన కష్టాలన్నీ చెప్పుకోగా, ఇంద్రపదవి తిరిగి ఇంద్రుడు పొందగల యజ్ఞాన్ని బృహస్పతి రూపొందించి, అభిచారక్రియ నిర్వర్తించాడు. ధర్మాన్ని కోల్పోయి మోహాంధకారంలో రజి పుత్రులంతా పడేలా చేయబడిన యాగం అది. ఆశించిన ఫలితం చిక్కింది. ఇంద్రునికి మళ్లీ పదవి దక్కింది.
ఇక ఆయువు 3 వ కొడుక్కి (రంభునికి) సంతానం లేదు. 'ఆయువు' మిగిలిన పుత్రులకూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగింది.