సత్రాజిత్‌ చరిత్ర-శ్రీ విష్ణు పురాణము

సత్రాజిత్‌ చరిత్ర-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌼🌼🌹🌹🌼🌼🌺🌺
Part 21

ఒకానొకప్పుడు ఈ సత్రాజిత్‌ అనువాడు సముద్రతీరాన ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై సూర్యుని విశేషంగా స్తుతించడంతో, అద్దానికి భాస్కరుడు ప్రసన్నుడై ఎదుట సాక్షాత్కరించాడు. ఏదైనా వరం కోరుకో మనగా సూర్యభగవానుని కంఠహారంలో మెరుస్తూన్న శ్యమంతకమణిని కోరాడు. అది అత్యంత స్వచ్ఛమైనది. సూర్యానుగ్రహముచేత పొందిన ఆ మణిని సత్రాజిత్‌ కంఠమున ధరించి ద్వారకలో ప్రవేశించాడు.

(ఇది కృష్ణావతారం యొక్క సమకాలీన ఘట్టం. ప్రసంగవశాన ఇక్కడ ఉటకించబడింది)

ఆ విధంగా సూర్యవరప్రసాదితుడై వస్తున్న సత్రాజిత్తును చూసి, ఎవరున్నదీ ఆ తేజమువెనుక తెలియక సూర్యుడని భ్రమించి, కృష్ణుని చూస్తూ పురప్రజలు "కృష్ణా! నీ దర్శనార్థం సూర్యుడొస్తున్నాడు" అన్నారు. వచ్చినవాడు సత్రాజిత్తు అని చెప్పాడు కృష్ణుడు.

ఆ సత్రాజిత్తు ఆ రత్నాన్ని తన ఇంట ఉంచుకున్నాడు. ప్రతిరోజు ఆ మణి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇవ్వసాగింది. దాని ప్రభావం వల్ల రాజ్యంలో అనావృష్టి, ఈతిబాధలు మొదలుగునవి లేకుండా ప్రజలు సుఖంగా ఉన్నారు. అటువంటిది రాజు దగ్గర ఉండాలని, ఉగ్రసేనుని కోసం దాన్నడగాలని ఉన్నా శ్రీకృష్ణుడు జ్ఞాతుల వల్ల వచ్చే అపార్థాలవల్ల దాన్ని అడగలేదు. ఎప్పటికైనా శ్రీకృష్ణుడు దాన్ని అడుగుతాడని భావించిన సత్రాజిత్‌ తన తమ్ముడు ప్రసేనజిత్‌కు దాన్నిచ్చాడు.

ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికి పోవ, నొక్క సింహ మామణిని మాంసఖండమని భ్రమించి వానినిజంపి యా మణిని గొనిపోవుచుండగా నొక భల్లూకమా సింహమును దునిమింది. యా మణిని తీసుకుని వెళ్ళి తన కొండ బిలమున తొట్టెలో బవశించియున్న తన కుమారైయగు జాంబవతికి ఆట వస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు, తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణిని యివ్వలేదని తన సోదరుని జంపి రత్న మపహరించెనని పట్టణమున చాటాడు.

తనమీద అకారణంగా పడిన నిందను బాపుకొనదలచిన శ్రీకృష్ణుడు బంధుసమేతుడై యరణ్యమునకు బోయి వెదుకగా నొక్కచో ప్రసేన కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును కనిపించెను. ఆ దారిని బట్టి పోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబున ఆగి, పరివారము నచట విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఊయలపై కట్టబడియున్న మణిని జూసి దానియొద్దకు పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడ్వదొడెంగెను. అంత దాదియును వింతమానిసి వచ్చెననుచు కేకలు వేసెను. అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబులు గ్రుచ్చుచు, కోరలతో కొరకుచు ఘోరముగ యుద్ధము చేయ కృష్ణుండును వానింబడద్రోసి వృక్షములచేతను రాళ్ళచేతను తుదకు ముష్ఠిఘాతములచేతను రాత్రింవబళ్ళు యిరువది ఎనిమిది దినంబులు యుద్ధం చేశాడు. కృష్ణుని రాకకోసం ద్వారం దగ్గర వేచువున్న బంధువులు మరలిపోయారు. లోపల జాంబవంతుడు నిరాహారంచేత నీరసించి ప్రాణావసానస్థితిలో ఓడిపోతినని శ్రీకృష్ణుని శరణువేడుకున్నాడు.

తన బలము హరింపజేసిన పురుషుడు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా దలచి అంజలి ఘటించి, "దేవా! భక్తజన రక్షకా! నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెఱింగితి. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞ యొసంగ నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము జేయవలెనని కోరుకుంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక వత్సరములు గడుపుచు నిట నుండ నిపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిధిలమయ్యె, ప్రాణములు కడబట్టె, జీవితేఛ్ఛ నశించె, నన్ను క్షమించి కాపాడుము. నీ కన్న వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి, "భల్లూకేశ్వరా! శమంతకమణి నొసంగుము నేనేగెద" అని దెల్ప నతడు శ్రీ కృష్ణునికి మణి సహితముగా తన కుమారైయగు జాంబవతిని కూడ కానుకగా నొసంగెను.

ఆ మణి గ్రహించకూడనిదైనా, తనపై అపవాదు బాపుకోవడానికి దాన్ని గ్రహించి,కన్యారత్నంతో కూడా ద్వారకకు వచ్చాడు.

జాంబవతితో ద్వారకకు

తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కానందము కలిగించి కన్యారత్నముతోనూ, మణితోనూ శ్రీకృష్ణుడు పురముజేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను జేర్చి యా వృత్తాంతమును జెప్పి శమంతకమణి నొసంగా నా సత్రాజిత్తు - "అయ్యో, లేనిపోని నిందమోపి దోషమునకు బాల్పడితి" అని విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను గైకొమ్మనిన, మణి వలదని మరల నొసంగెను.

ఆ సత్యభామపై ఒకప్పుడు శతధన్వుడనువాడు మనసుపడ్డాడు. శ్రీకృష్ణునికి ఆమెనిచ్చి చేయడం తమను అవమానించడమే అని భావించిన శతధన్వుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేని తరుణము చూసుకొని, సత్రాజిత్తును వధించి ఆ శ్యమంతకమణిని తీసుకున్నాడు. సత్యకీసంగతి తెలిసి, వారణావతంలో ఉన్న కృష్ణుని దగ్గరకు వెళ్లి 'మా తండ్రిని చంపి, శతధన్వుడీ సారి మణిని అపహరించాడు' అని చెప్పింది.

కృష్ణుడు క్రోధావేశితుడై "ఆ దురాత్మునిక సైరించదల్చుకోలేదు" అని బలరాముని సన్నిధికి వచ్చి "అన్నా! శతధన్వుని చంపే ప్రయత్నం చెయ్యి" అని ఏకాంతంలో సోదరునికి సూచించాడు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలన్నాడు కూడా! కాని, ఆ రహస్యం ఎలాగో శతధన్వుని చెవికి చేరిపోయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది