మీ భవిష్యత్‌కు బ్రేకులు వేసుకోకండి!

మీ భవిష్యత్‌కు బ్రేకులు వేసుకోకండి!

మీరు మీ భవిష్యత్‌ను బ్రహ్మాండంగా ఊహించుకుంటారు. నిజానికి మీ ఊహ నిజం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కాని చాలామంది తమ భవిష్యత్‌కు తామే బ్రేకులు వేసుకుంటారు. వారి ఆలోచనలు వ్యతిరేక ధోరణిలో ఉండడంతో వారు అనుకున్న లక్ష్యాన్ని వారు సాధించలేరు. మనిషికి ఏడు రకాల వ్యతిరేక ధోరణులు ఈ అడ్డుగోడలు నిర్మిస్తాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
మీ మనసులోకి ఈ ఏడు అవరోధాలను రానివ్వకపోతే మీ కలలను, ఊహలను నిజం చేసుకోగల్గుతారు.

నాకేం కావాలో నాకు తెలియదు
పది మందిలో తొమ్మిది మందికి వారికి ఏమి కావాలో వారికి తెలియదు. రాబోయే రోజుల్లో ఏమి సాధించాలనుకుంటున్నారో చెప్పలేరు. వీరంతా లక్ష్యాలు ఏర్పరచుకోరు గాని తమ భవిష్యత్ గురించి పగటి కలలు కంటూ ఉంటారు. గుర్తింపు, అభినందన, అధిక ఆదాయం, మంచి ఆరోగ్యం, భద్రత వంటివి అన్నీ రావాలని అస్పష్టమైన ఆశలతో ఉంటారు.

ఈ రోజున మిమ్ములను ఎవరైనా రాబోయే ఏడాది లేదా అయిదేళ్లలో మీ లక్ష్యాలు ఏమిటని అడిగితే మీరేమి చెబుతారు? నిజంగా నాకు ఏమి కావాలో నాకు తెలియదు’ అంటారు. మీ భవిష్యత్‌కు బ్రేకులు వేసుకునే మొదటి ఆలోచన ఇదే. మీకు ఏమి కావాలో మీకు స్పష్టమైన లక్ష్యం లేకపోవడమే.
మీకు ఇరుగు పొరుగు వారు స్నేహితులు అనేక మంది ఉంటారు. వారిని ఇదే ప్రశ్న అడగండి. కేవలం కొద్ది మంది మాత్రమే స్పష్టమైన ఆలోచనలు, లక్ష్యాలు కలవారు ఉంటారు. ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివే విద్యార్థులు వీరందరిలో కూడా చాలా కొద్దిమందికే భవిష్యత్ గురించి నిర్దిష్టమైన ప్రణాళికలు, లక్ష్యాలు ఉండడం ఆశ్చర్యం అన్పిస్తుంది.

ఏ లక్ష్యం సాధించాలో అవగాహన ఉన్నవారే తమలోని శక్తి సామర్థ్యాలను ఆ దిశలో వినియోగించుకుంటారు.
ప్రణాళికలుండవు
చాలామందికి భవిష్యత్ గురించి ఎటువంటి ప్రణాళికలు ఉండవు. భవిష్యత్ గురించి భవిష్యత్ చూసుకుంటుందని భావిస్తారు. సినిమాకి వెళ్లాలన్నా, చిన్న క్యాంపునకు వెళ్లాలన్నా ప్రణాళికలు వేసుకునే వీరంతా భవిష్యత్‌కు సంబంధించిన ప్రణాళికలు వేసుకోరు.

ఎక్కడికైనా వెళ్లాలంటే ఎలా వెళ్లాలి? ఎంత సమయంలో వెళ్లాలి? వంటివి ఆలోచించుకోగల వారు భవిష్యత్‌ను వదిలేసుకోవడం, వారి భవిష్యత్‌కు వారే బ్రేకులు వేసుకోవడం కాదా? భవిష్యత్ గురించి స్పష్టమైన ప్రణాళికలు వేసుకుని ఆ ప్రకారం కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలు సాధించగల్గుతారు.

ఎలిబీలు
మీకు రావాల్సినవి రాకపోవడానికి అనేక కారణాలు చెబుతారు. అసలు ఎలా ఎదగాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. కుటుంబ బాధ్యతలు మనిషిని వెనుకకు లాగేస్తాయి. సరియైన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం రాలేదు. మనది దురదృష్టం. ఇక వయసు దాటింది. ఏం చేయగలం?

ఇటువంటి ఎలిబీ ఆలోచనలను గమనించుకోవాలి. వీటివల్ల మనిషికి సౌకర్యంగా ఉండవచ్చు. తన మీద తనకు సానుభూతి కల్గవచ్చు. మీరు కోరుకున్నది మీకు రాకపోతే అనుభవించాల్సిందే. ఎవరినీ దేనికీ బాధ్యులను చేయనవసరం లేదు. మీరే దీనికి బాధ్యులని గుర్తుంచుకోవాలి. ఇటువంటి వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండగల్గితే మీరు కోరుకున్నవి మీరు సాధించుకో గల్గుతారు.

వాయిదాలు
చాలామంది తమకున్న ఆర్థిక బడ్జెట్‌లో జాగ్రత్తగా బ్రతకడానికి అలవాటు పడి ఉంటారు. సంపాదనను బట్టి ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కాని సమయం విషయంలో అలా కాదు. సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో చేయక వాయిదాలు వేసుకుని సమయాన్ని నిర్లక్ష్యంగా దుర్వినియోగం చేసుకుంటారు.
వాయిదా పరాజయానికి కేంద్ర బిందువు వంటిది. మీ ఉన్నతికి పెద్ద అడ్డంకి వాయిదా. దీనిని దూరంగా ఉంచగల్గితే విజయాలు దరిజేరతాయి.

మార్పు అంటే భయం
ఉద్యోగం మారాలంటే భయం. కొత్త ఉద్యోగంలో రాణించేందుకు మళ్లీ బోలెడంత చదవాలి. అందుకే చాలా మంది మార్పు అంటే భయపడతారు. భవిష్యత్ ఏమిటో తెలియని కొత్త ఉద్యోగంలో చేరడం కన్నా హాయిగా కాలక్షేపం అవుతున్న ఉన్న ఉద్యోగంలో ఉండిపోవాలనుకోవడం తమ ఎదుగుదలకు వేసుకునే మరో బ్రేకు.

గత వైభవాలు
చాలామంది సాహసోపేతమైన, ఉత్సాహభరితమైన, విజయవంతమైన, సంతోషకరమైన భవిష్యత్ అవకాశాలను సులువుగా పాడు చేసుకుంటారు. తామున్న స్థితిని తక్కువ చేసుకుంటూ గత ఉద్యోగం, రోజులు, వైభవాన్ని తలచుకుంటూ, చేయాల్సిన పనులను సక్రమంగా చేసుకోరు. తరచు ‘ఆ పాత రోజులు రావు’ అనుకుంటారు గాని ‘ముందున్నాయి బంగారు రోజులు’ అని భావించరు.

భూషణరావు తండ్రి ఒక కంపెనీ ప్రారంభించి విజయవంతంగా నడుపుతూ ఉండేవాడు. చిన్న వయసులోనే భూషణరావు దానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేవాడు. భూషణరావు తండ్రి మరణించడంతో ఆ కంపెనీ దివాలా తీయడం, అప్పులు ఇచ్చిన వారు కంపెనీని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

భూషణరావు వేరొక కంపెనీలో సేల్స్‌మేన్‌గా చేరాడు. తరచు తన పాత రోజులు గుర్తు తెచ్చుకుని వచ్చిన కస్టమర్స్‌కు సరుకు అమ్మడం మరచి తన గతం గురించి చెప్పేవాడు. సేల్స్ మేనేజర్‌గా పదోన్నతి పొందవలసిన వ్యక్తి ఉద్యోగం పోగొట్టుకునే స్థితికి వచ్చాడు.

నిన్న అనేది చరిత్ర, రేపు అనేది రహస్యం. నేడు అనేది వాస్తవం. దానిని సద్వినియోగం చేసుకున్న వాడే విజేతగా దర్శనం ఇస్తాడు.

నిర్ణయం తీసుకోలేరు
మనలో చాలామంది నిర్ణయాలు తీసుకోరు. ఏం చేయాలనుకుంటున్నామో మనకు తెలుసు. కాని నిర్ణయం తీసుకోము. ప్రతి దానికి వెనకాడతాము.

సరియైన సమయంలో ప్రణాళికలు వేసుకుని కృషి చేయడం ప్రారంభిస్తాం. లేదా తగినంత డబ్బు సంపాదించుకుని దాచుకున్నాం. లేదా వ్యాపారం బాగా జరుగుతోంది. అటువంటి సమయాల్లో నిర్ణయాలు తీసుకోలేక సతమతమయి పోతూ ఉంటారు. ఈ సమయంలో రోజులు, వారాలు, నెలలు దొర్లిపోతాయి. నిర్ణయం తీసుకోలేక పోవడం వల్ల ఎంతో నష్టపోతారు.

యువత బలహీనత నిర్ణయం తీసుకోలేక పోవడం. సరైన సమయంలో వెంట వెంటనే నిర్ణయాలు కచ్చితంగా తీసుకోవాలని నేర్పే ఏకైక గురువు అనుభవం. కొంతమంది జీవిత కాలంలో ఇది నేర్చుకోరు.

చాలమాంది తరచు అంటూ ఉంటారు ‘ఆ సమయంలో నిర్ణయం తీసుకోక పోవడం పెద్ద తప్పు’
ఎన్ని తెలిసినా, ఎంత అనుభవం ఉన్నా తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటారు. మనిషి తమ లక్ష్యాలను సాధించి భవిష్యత్ బంగారుమయం చేసుకోవాలంటే తమకు తాము బ్రేకులు వేసుకోకూడదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది