గణాధిపత్యం కోసం భూ ప్రదక్షిణం చేసి రమ్మని వినాయకుడికి, కుమారస్వామికి పందెం పెట్టారు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు. వినాయకుడు లంబోదరుడు. మూషిక వాహనుడు. ఆయన మయూర వాహనుడైన కార్తికేయుడితో ఎలా గెలవగలడు? అందుకే నారదుడి ఉపదేశం అనుసరించి తల్లిదండ్రులిద్దరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసిన వినాయకుడు- భూప్రదక్షిణం చేసినంత ఫలం పొందుతాడు. అందువల్ల ఆయన గణాధిపత్యమూ సాధించాడన్నది పురాణ గాథ.
ఏ పని చేయడానికైనా పలు మార్గాలుంటాయి. శ్రమతో కూడిన బండ పద్ధతులు కొన్ని, ఉపాయంతో సాగే సులభ విధానాలు మరికొన్ని. తెలివైనవాడు సద్గురువుల కారణంగానో, చదువుసంధ్యల ద్వారానో, స్వబుద్ధితో ఆలోచించుకోవడం వల్లనో అలాంటి సులువైన రీతి అనుసరిస్తాడు. తక్కువ శ్రమతో సాధ్యమైనంత ఎక్కువ ఫలితం పొందుతాడు. అది నేర్పరితనం, అంతకుమించి అతణ్ని బుద్ధిశాలిగా నిరూపించే లక్షణం.
ప్రాణికోటి అంతటిలోనూ మానవజాతి మకుటాయమానంగా నిలవడానికి ప్రధాన కారణం- మనిషికి గల ఆ నేర్పరితనమే! సూది, గొడ్డలి మొదలు చురుకు (స్మార్ట్) ఫోన్లు, విమానాల దాకా మనిషి తన బుద్ధిశక్తితో సమకూర్చుకొన్న సదుపాయాలన్నీ- పనులను సులభతరం చేసే మార్గాలే. వాటి ద్వారా అతడు ఎంతో వస్తుసంపదను, సుఖ సాధన సమృద్ధిని సాధించుకోగలిగాడు. కోరిన ఫలాల కోసం ఎన్నో సులభ మార్గాల్ని పరిశోధించి, అన్నింటినీ అందుబాటులోకి తెచ్చుకున్నాడు.
శ్రమ లేకుండా ఫలితాన్ని సాధించిపెట్టేలా అనేక సూక్ష్మ పద్ధతులు ఉంటాయి. అవి మనిషిలో సుఖలాలస పెంచుతాయి. అదే సమయంలో శ్రమకోర్చే తత్వాన్ని, పట్టుదలను, విలువల్ని సడలిస్తాయి. మనిషిని బలహీనపరచే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కొన్ని సందర్భాల్లో అటువంటి ధోరణుల్ని పెద్దలు నిరసిస్తారు. ‘విజయ సాధనకు కఠోర పరిశ్రమను మించిన మార్గం లేదు’ అని ఘనకార్యాలు సాధించిన మహనీయులు చెబుతుంటారు. ‘కష్టే ఫలీ’ అని హితవు పలుకుతుంటారు. అడ్డదారులు తొక్కి అడ్డమైన గడ్డీ తినడం హానికరం అని బోధించే సామెతలు, సుభాషితాలు లోక వ్యవహారంలో అసంఖ్యాకంగా కనిపిస్తాయి.
సకల పురుషార్థ సాధకమైన ‘సాకేత రాముడి భక్తి’ అనే రాజమార్గం ఉండగా, ఇక అడ్డదోవలు ఎందుకు అని ప్రశ్నించినవారున్నారు. ‘చక్కని రాజమార్గములుండగ, సందుల దూరనేల ఓ మనసా?’ అని గానంచేశారు సద్గురు త్యాగరాజస్వామి. ‘నువ్వు చేరే గమ్యం కంటే, దాని కోసం నువ్వు అనుసరించే మార్గమే ముఖ్యం’ అనేవారు గాంధీజీ.
మనిషి కర్తవ్యమేమిటి? ఎలాగోలా సూక్ష్మ పద్ధతులు వాడి, సునాయాసంగా కార్యం సాధించు కోవడమా,నీతిగా, ధర్మంగా పట్టుదలతో పరిశ్రమించి ఫలితాలు పొందడమా? సులభ మార్గాలు, సూక్ష్మ పద్ధతులు అనుసరించడంలో అనైతికత, అధర్మం, అన్యాయం లేవు. అనైతికత అనేది- ఆ మార్గాల అనుసరణలో ఉన్నదే తప్ప, సులభ మార్గాల్లో కాదు. అయిదు నిమిషాల్లో ఉపాయంగా పూర్తి చేయగల పని కోసం అయిదు గంటలు శ్రమించడం సమర్థనీయం కాదు. అలాగని కేవలం పని ముగించేందుకు- తెలిసి తెలిసీ అధర్మ మార్గాలు, నీతిబాహ్యమైన అడ్డదోవలు ఎంచుకోవడంలో విజ్ఞత లేదు. అది స్వల్పకాలంలో సత్ఫలితాలిచ్చినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో దుష్ఫలితాలకే దారితీస్తుంది.
దురాశ వల్ల మనిషి అనైతిక రీతిలో అడ్డదోవలు తొక్కుతాడు. ఆ దారులు అతణ్ని గమ్యానికి చేర్చవు. ఏ కారణంగానైనా చేర్చినా, ఆ గమ్యం అతడికి ఇవ్వవలసినంత ఆనందం ఇవ్వదు. ఆ మార్గంలో గమ్యం చేరినా ఒకటే, చేరకపోయినా ఒకటే. పదిమంది మెచ్చి ఇచ్చిన బహుమతి కాని, బిరుదు కాని, బంగారు పతకం కాని ఎంతో విలువైనది. దాన్ని అంగట్లో కొని తెచ్చుకొంటేనో, దొంగిలించి సొంతం చేసుకొంటామంటేనో ఎలా? అసలైన సత్కారం వల్ల పొందే ఆ ఆనందమే లోకంలో వేరుగా ఉంటుంది.
ఇహపర శ్రేయస్సు కోరుకొనేవారు ఏం చేయాలి? ఇహలోక జీవనంలో సత్యం, ధర్మం, భూతదయ, పాపభీతి వంటివి అవలంబించడమే రాజ మార్గమన్నది పెద్దల మాట. ఆ మార్గం వదిలి అత్యాశతో అడ్డదారిన సాగితే మొదటికే మోసం. అలా ప్రవర్తించినవాళ్లు దుర్యోధనాదుల్లా భ్రష్టులయ్యారే తప్ప, బావుకొన్నదేమీ లేదు. చరిత్రను గమనిస్తే- ఇదే మాట కాలం పెట్టిన పరీక్షల్లో నిలిచి నెగ్గినట్లు కనిపిస్తుంది. అందుకే ఇటువంటి హెచ్చరికలు అన్ని కాలాల్లో, ప్రాంతాల్లో, మత సంప్రదాయాల్లో, నీతిగ్రంథాల్లోనూ చోటుచేసుకున్నాయి!