దైవాన్ని చూడగలిగిత

* అందరిలోనూ దైవాన్ని చూడగలిగితే అదే దివ్యత్వం.

* అన్నిటినీ ప్రేమించగలిగితే అదే జ్ఞానస్పర్శ.

* స్వార్థం, సంకుచితం ఎరుగని సువిశాల భూమిక ప్రేమ.

* మోక్షానికి అందరూ అర్హులే. కాకపోతే సాధనలో అర్హతను సాధించుకోవాలి.

* అంతా బ్రహ్మమైనపుడు అందరూ బ్రహ్మమే.

* వెలుగు మూలం వెలుగే. ఆ వెలుగు బయటా ఉన్నది, లోపలా ఉన్నది.

* దైవం, ప్రకృతి, పదార్థం, శక్తి… ఏ పేరుతో అనుకున్నా ఉన్నదొకటే.

*తాత, తండ్రి, కొడుకు, భర్త, యజమాని, గురువు, శిష్యుడు, పరిచారకుడు, అన్న, మామ, వంటివి పురుషుడి పరంగా, తల్లి, చెల్లి, కూతురు…వంటివి స్త్రీపరంగా అనేక స్థితులున్నా ఉన్న వ్యక్తి ఒక్కరే! తనువుతో ఏర్పడేవన్నీ బాంధవ్యాలు, అనుబంధాలు. తనువులోనే తెల్లవారే కల్లలు. దీనంతటినీ పరచుకుని ఉన్నది ఆత్మే.

* ఆత్మైక స్థితిని అనుభవించాలేగానీ, ఆవిష్కరించలేం.

* దర్శించగలిగితే ఆత్మ తప్ప అన్యంలేదు. అంతా అదే అయినపుడు మరొకటంటూ లేదు.

* కనబడుతున్న దానిని ప్రపంచమని, కనబడనిదాన్ని దైవమనీ అంటున్నాం. కానీ వున్నదంతా దైవమే.

* తాడుకి రెండు కొసలున్నట్లు, విజ్ఞానం, ప్రజ్ఞానం ఉన్నయ్. రెండిటినీ సమన్వయం చేసుకోవటమే సాధన.

* కదిలేదంతా కనపడుతున్నది. కదిలించేది కనబడటం లేదు. కనబడటం లేదు కనుక, అది లేదనుకోరాదు.

కనబడుతున్నదంతా శాశ్వతంగా ఉంటుందని అనుకోవటం అజ్ఞానమే.

* కడలిలోనే కెరటాలున్నయ్. సముద్రానికి అవతల సముద్రం లేదు. అలలు, తుప్పరలు సముద్రం కంటే భిన్నం కావు.

స్థితి, గతి, రూపం, నామం భిన్నంగా కనబడుతున్నయ్. అంతే!

* అసమత్వమే సృష్టి. వైరుధ్యమే ప్రకృతి. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే, యాతనలుండవు.

* జరుగుతున్న దాన్ని అంగీకరించటం, సాక్షిగా ఉండగలగటం స్థిమితాన్నిస్తుంది. ఎదురీదటంలో అహంకారం, అలసట, నిర్వేదం, శ్రమ ఒదిగి ఉన్నయ్.

* ప్రతిఘటనలో దాగిన ఘటనను స్పష్టంగా అనుభవించగలిగితే, శాంతి సైతం కైవసమౌతుంది. కావలసిందల్లా హేతువును గుర్తించగలగటం.

* అహం స్ఫురణను పెంచుకోగలిగితే అహంకారం నశిస్తుంది.

* దేన్నో ఆశిస్తూ ధ్యానించకు. అంతరంగంలో శూన్యస్థితిని, అంటే నిర్వికార స్థితిని అనుభవించటం కోసం ధ్యానించాలి. అదే అసలైన పూర్ణ స్థితి.

* తృప్తే సంపద. తృప్తే ఆనందం. తృప్తే శాంతి.

* పరిస్థితులు మంచివి కావు. చెడ్డవీ కావు. అర్థం చేసుకోగలిగితే, అవి గురు స్వరూపాలే. వాస్తవాన్ని ఆవిష్కరించే అవకాశాలవి.

* అధ్యాత్మ భావంతో పెనవేసుకున్న వినయమే నిజమైన సాధన.

* పడిపోతే ఏడవటం చూస్తాం. ఆటలో పడిపోతే హాయిగా నవ్వుతూ ఆట మొదలుపెట్టడం సహజంగా జరిగిపోతుంది. జీవితాన్ని ఆటగా అనుకోగలిగితే కిందపడ్డా ఆనందమే.

* అన్నిటిలో ఏకత్వాన్ని చూడగలగటమే పరమానందం.

* పుట్టుకకీ, మరణానికి మధ్య తేడా లేదనుకోవటమే అమృతత్వం.

*ఏది సాధ్యమో అదే సాధన. శోధిస్తున్నంత సేపూ అసాధ్యంగా కనిపిస్తున్నది, శోధన పూర్తై ఫలితం దొరికినపుడు కలిగే పులకింతే ఒక ఆనందరేఖ.

* మతాలు సూచించిన మార్గాలన్నీ మంచివే. అర్థం చేసుకోవటం లోనూ, ఆచరించటంలోనూ ఉన్న అస్పష్టత వల్ల, అసమగ్రత వల్ల భేదం ఉన్నట్లనిపిస్తుంది.

* మతానికి ధర్మం ఉన్నది. ధర్మం మతాతీతం, దేశకాలాతీతం. ధర్మంలోనే మిగిలిన మూడు పురుషార్థాలు ఇమిడి ఉన్నయ్.

* జీవుడి దంతా ప్రయత్నమే. అది కనిపిస్తుంది. దైవానిది ప్రేరణ. అది కనిపించదు. కానీ అదే సత్యం. * సాధనలో ఒక స్థాయిని అందుకున్న తరుణంలో సాధకుడు తిరిగి వెనక్కి చూడకూడదు. ప్రాపంచిక ఆకర్షణలు ఎన్ని ఎదురైనా పతనం చెందకూడదు. అంతరంగ దర్శనానికై తీవ్ర ప్రయత్నం చేయాలి.

* స్వార్థం మానవ ప్రవృత్తిలో ఒక భాగం. అధిగమించే ప్రయత్నమే సాధన. దాటగలిగితే మానవుడు తనలోని మాధవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలడు.

*అధ్యాత్మ సాధన మన చేతుల్లోనే ఉన్నది. చేయగలిగినంత మనం సాధన చేయగలం. చేయలేనిది చేస్తామనటం అహంకారమే. * అరిషడ్వర్గాలను జయించటం మాత్రమే కాదు. ఆరు రకాల వికారాలను సాధన ద్వారా, అనుభవం ద్వారా రూపాంతరీకరణం చేసుకోవాలి. కాలగమనంలో సాధనా తీవ్రతతో అవే తమ ప్రభావాన్ని తగ్గించుకుని, సరైన సమయంలో సమశక్తిగా అభివ్యక్తమౌతయ్. వికృతి నుండి ప్రకృతి వైపు మరలటమే జరగవలసింది.

* విధి ఉన్నది. దాన్ని దాని పనిచెయ్యనిద్దాం. మన ప్రవృత్తి ద్వారా, జీవన విధానం ద్వారా, జీవన దృక్పథం ద్వారా, జీవనశైలి ద్వారా విధిని అనుసరిస్తూ అంగీకరించటమే మన విధి. కావలసిందల్లా సమన్వయమే, సంఘర్షణ కాదు.

* సర్వాత్మ భావనే, సర్వేశ్వర భావన!

ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది!

అన్ని పరిస్థితులనూ ఆకళింపు చేసుకోవాలి.

దైవం పట్ల అచంచల విశ్వాసంతో జీవించాలి.

అన్ని రూపాలు ఆయనవే. అన్ని పేర్లు ఆయనవే.

అన్ని గుణాలు ఆయనవే.

భగవంతుడంటే ప్రత్యేకం కాదు. ఉన్నదంతా దైవమే!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది