ఆదిపర్వము – 22

ఆదిపర్వము – 22

🍁🍁🌸🌸🌺🌺🌸🌸🍁🍁
చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల వృత్తాంతం
శంతనుడికి సత్యవతి ద్వారా ఇద్దరు కొడుకులు పుట్టారు. వారు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. వారు చిన్న వయసులో ఉండగానే శంతనుడు వారిని పెంచి పెద్ద చేసాడు. చిత్రాంగదుడిని చక్రవర్తిని చేసాడు.
చిత్రాంగదుడు అహంకారి. ఒకసారి చిత్రాంగదుడు ఒక గంధర్వ రాజుతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుధ్ధంలో చిత్రాంగదుడు చనిపోయాడు. తరువాత విచిత్ర వీర్యుని చక్రవర్తిని చేసాడు.
కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు తాను ఒక్కడే ఒంటరిగా కాశీ రాజ్యానికి వెళ్లాడు. కాశీరాజు కూతుళ్లను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకొన్నాడు.
"కాశీ రాజా, స్వయంవరానికి వచ్చిన రాజులా, నేను ఈ కన్యలను నా తమ్ముడు విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చెయాడానికి తీసుకు వెళుతున్నాను. మీకు చేతనైతే నన్ను అడ్డగించండి. ఎనిమిది రకాల వివాహ విధులలో, క్షత్రియులకు గాంధర్వము, రాక్షసము తగినవి. పైగా మీ అందరిని జయించి, తీసుకుపోవడం పరమధరమము" అని గర్వంగా పలికాడు.
అక్కడ ఉన్న రాజులు అందరూ భీష్ముని ఎదిరించారు. కాని భీష్ముడు అందరిని జయించాడు. కాని సాల్వుడు అనే రాజు మాత్రం, పట్టు విడవకుండా భీష్ముని వెంబడించాడు. భీష్మునికి సాల్వునికి ఘోర యుధ్ధం జరిగింది. అందులో సాల్వుడు ఓడిపోయాడు. వెనక్కు తిరిగాడు. భీష్ముడు హస్తినా పురానికి వెళ్లాడు.
కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక అను కన్యలను విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అందులో పెద్ద కూతురు అంబ, భీష్మునితో ఇలా చెప్పింది:
"సాల్వుడికి నన్ను ఇచ్చి వివాహం చెయ్యడానికి నా తండ్రి నిశ్చయించాడు. నాకు కూడా సాల్వుడు అంటే ఇష్టమే. కాని మీరు నన్ను బలవంతంగా తీసుకువచ్చారు. ధర్మం మీరే నిర్ణయించండి" అని పలికింది.
వెంటనే భీష్ముడు అంబను కొందరు బ్రహ్మణులను తోడు ఇచ్చి, సాల్వుని వద్దకు పంపాడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేసాడు.
విచిత్ర వీర్యుడు అందమైన తన భార్యలతో కామ భోగాలలో తేలియాడుతున్నాడు. రాచ కార్యాలు మర్చిపోయాడు. విచ్చల విడిగా కామ భోగాలు అనుభవించి, అనుభవించి కడకు చనిపోయాడు. ఇప్పుడు రాజ్యం రాజు లేని రాజ్యం అయింది.
ఒకరోజు సత్యవతి భీష్ముని చూసి "కుమారా, ప్రస్తుతం ఈ భరత సామ్రాజ్యానికి వారసులులేరు, నువ్వు ఒక్కడివే రాజ్యానికి అర్హుడివి. కాబట్టి నువ్వే ఈ రాజ్యానికి చక్రవర్తివి. హాయిగా పెళ్ల్ చేసుకొని, సంతానాన్ని కని ఈ వంశాన్ని ఉద్ధరించు" అని చెప్పింది.
"అమ్మా, నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసాను. రాజ్యాధికారం ముట్టనని శపధం చేసాను. ఇప్పుడు మీరు ఇలా పలకడం తగునా. నేను మాత్రం నా బ్రహ్మచర్య వ్రతాన్ని విడువను. శంతనుని వంశము వృద్ధి చెందేట్టు నాకు తెలిసిన క్షత్రియ ధర్మాన్ని చెపుతాను వినండి. దీనిని బ్రాహ్మణులతోనూ, ధర్మ విదులతోనూ ఆలోచించి నిర్ణయం చెయ్యండి.
పూర్వము, పరశురాముడు క్షత్రియ లోకాన్ని సమూలంగా నాశనం చేసినపుడు, వారి భార్యలు ఉత్తమమైన బ్రాహ్మణుల వలన సంతానాన్ని కని, క్షత్రియ వంశాలను నిలిపారు.
అదియును కాక, ఉతధ్యుడు, బృహస్పతి అన్నదమ్ములు. ఉతధ్యుని భార్య మమత. ఆమె గర్భవతి. ఒకరోజు బృహస్పతి సోదరుడైన ఉతధ్యుని ఇంటికి వచ్చాడు. మమతను చూసి, దేవర న్యాయాన్ని అనుసరించి మమతతో పొందు కోరాడు. అప్పటికే గర్భంలో ఉన్న బాలుడు దీనిని వ్యతిరేకించాడు . ఇది ధర్మ విరుధ్ధమని పెద్దగా అరిచాడు. బృహస్పతికి కోపం వచ్చి, ఆ బాలున్ని పుట్టు గుడ్డిగా శపించాడు.
ఆ బాలుడే దీర్ఘతముడు. దీర్ఘతముడు గుడ్డివాడైనా వేద వేదాంగాలు అభ్యసించాడు. ప్రద్వేషిణి అనే కన్యను వివాహమాడాడు. అతనికి చాలా మంది పుత్రులు కలిగారు. కాని ప్రద్వేషిణికి మాత్రం భర్తమీద ప్రేమ లేదు. అదే విషయం దీర్ఘతముడు అడిగాడు.
"భరించే వాడు భర్త, భరింపదగినది భార్య. కాని ఇన్నాళ్లు నేను నిన్ను భరిస్తున్నాను. ఇంకా ఎంత కాలం భరించాలి. నా చేత కాదు. నువ్వు వేరే చోటికి వెళ్లు" అని పలికింది.
దీర్ఘతమునికి కోపం వచ్చి "భర్తలు లేని భార్యలు, ఎంతటి వారైనా అలంకారాలు, తాళి లేకుండా దయనీయమైన బతుకు బతుకుదురుగాక" అని శాపం ఇచ్చాడు.
ప్రద్వేషిణి కోపంతో తన కొడుకులను పిలిచి "ఈ ముదుసలిని ఎక్కడికైన తీసుకుపోయి విడీచిపెట్టండి" అని కోరింది.
తల్లి మాట మీద కొడుకులు, దీర్ఘతముని తాళ్లతో కట్టి ఒక నదిలో పడవేసారు. ధీర్ఘతముడు వేదాలు వల్లెవేస్తూ నదిలో కొట్టుకుపోతున్నాడు. బలి అనే రాజు దీర్ఘతముని చూసి, అతని పాండిత్యానికి సంతోషించాడు. కట్లు విప్పి తనతో ఇంటికి తీసుకొని వెళ్లాడు.
"మహాత్మా, తమరు ఎవరో నాకు తలియదు. కాని మీరు ఉత్తమమైన బ్రాహ్మణులు. నాకు సంతానం లేదు, దయచేసి నాకు సంతానం ప్రసాదించండి" అని కోరాడు. తన భార్య అయిన సుధేష్ణను దీర్ఘతముని వద్దకు వెళ్లమన్నాడు.
సుధేష్ణకు దీర్ఘతముని చూస్తే రోత కలిగింది. అందుకని తన మాదిరే ఉన్న్న తన దాసీని అలంకరించి దీర్ఘతముని వద్దకు పంపింది. దీర్ఘతముని వలన ఆ దాసికి పదకొండుమంది కొడుకులు పుట్టారు.
బలి వారిని చూసి "మహాత్మా, వీరు నా కొడుకులేనా?" అని అడిగాడు.
"కాదు మహారాజా. వీరు నీ వంశంలో పుట్టిన వారు కాదు. దాసీ పుత్రులు" అని చెప్పాడు.
బలి మరల తన భార్య సుధేష్ణను దీర్ఘతముని వద్దకు పంపాడు, చేసేది లేక వెళ్లింది. వారికి అంగరాజు అనే కొడుకు పుట్టాడు.
కాబట్టి, విధిలేని పరిస్తితుల్లో ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందటం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ధర్మ విరుధ్ధము కాదు. అందుకని మనము ఇప్పుడు ఒక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకు రావాలి. అతను ఈ కురు వంశాన్ని ఉధ్ధరిస్తాడు" అని పలికాడు భీష్ముడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది