రామ అనే రెండక్షరాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇష్ట కామ్యాన్ని అందిస్తాయి. సర్వపాపాలు హరిస్తాయి. సమస్తమూ వ్యాపించి కేవలం నామ జపంతో నారాయణ సన్నిధి చేరుస్తాయి. ఆ రాముడి జీవన గమనమే రామాయణం. అవేద ప్రతిపాద్యుడైన పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు. అవతార పురుషునిగా జన్మించిన శ్రీరాముడు సామాన్య మానవుడిలా ప్రవర్తించి ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. రామో విగ్రహవాన్ ధర్మ: అన్నారు. దేవుడు మానవుడై మానవుడిని దేవుడిగా చేయటానికి మార్గం చూపిన మహత్తర అవతారం.
పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతీ పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమ్ వావశిష్యతే (ఈశోపనిషత్తు) సంపూర్ణ జ్ఞానమ్ అవ్యక్తం. ఆ వ్యక్తం కాని వస్తువును సాధనాపరంగా వ్యక్తం చేసినదే రామాయణం. రామాయణం వేద ధర్మమును బోధించుచున్నది. రామ శబ్ద తత్ స్వరూపం, రాముడు ధర్మాన్నికి రూపం. రామనామం సోమ సూర్యగ్నులను మించిన స్వప్రకాశం.
ర అక్షరం అగ్ని సంబంధమైనది. మనస్సులోని శుభకర్మల యొక్క భావనలను నశింపజేసి, అద్వైతమును అవగాహనకు తెచ్చునది. ఆ అక్షరం సూర్యసంబంధ బీజం అవిద్యను, అజ్ఞానమును హరించి సర్వవేద సంబంధ జ్ఞాన మునిస్తుంది. మ కారం చంద్రబీజం అది దైవత అదిభౌతిక ఆధ్యాత్మికములనే త్రి విధములైన తాపములను నశింపచేయును. ర-అ-మ-…. రామ అన్ శబ్దం సకల కర్మ సంకల్పములను నశింపజేసి అద్వైతమునకు దారి చూపే సర్వజ్ఞాన స్వరూపం. త్రిమూర్తుల ఏకతా రూపమ్ రామ శబ్దం, సత్యగుణముతో కలసిన జ్ఞాన రూపం శ్రీరామచంద్రుడు.
శ్రీరాముడు మానవాకారం దాల్చిన భగవంతుడు కాని తాను ఏక్కడా భగవంతుడినని, సర్వశక్తి సమన్వతుడనని చెప్పుకోలేదు. సామాన్య మానవుడిలాగానే ఆయన యానం నడిచింది. అందుకే కష్టనష్టాలు, సుఖదు:ఖాలకు అతీతంగా ఏలా మనిషి ప్రవర్తించాలో అలా ఆయన ప్రవర్తించి మానవాళికి చెప్పక చెప్పిన గురువయ్యాడు. మిగిలిన అవతారాల కన్నా రామావతారంలో ఉన్న విశిష్టత ఇది. అందుకే రాముడు ఆరాధ్యుడు. సర్వధర్మ స్వరూపుడు.
వేటగాడి వేదన రామాయణమైంది. జనని వేదన జన్మకారణమైంది. వాల్మీకి రామాయణం అన్ని కాలాలకూ ఆదర్శం. అద్వైతులు శ్రీరాముని పరబ్రహ్మగా వైష్ణవులు విష్ణువుగా, శైవులు శివునిగా, శాక్తయులు శక్తి సంకేతంగా, యోగులు పరమాత్మునిగా జపించి తరిస్తున్నారు. శ్రీరామ అనే పదం శ్రేష్టమైంది. కేవలం ఒక భౌతిక రూపాన్ని బోధించే పదం కాదు. ఉపేయమైన భగవత్రృప్తిని బోధించే పదం.
మానవుడు తమ వ్యక్తిగత జీవితాన్ని సమాజ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా ఏ విధముగా మలచుకోనవలయునో చాటి చెప్పే ప్రవర్తనా నియమావళియే శ్రీరామ చరితము. శ్రీమద్రాయణంలో సర్వకల సర్వదేశ సర్వప్రజలు ఆచరించ దగిన నీతి, ధర్మము, సత్యము, జీవిత విధానము నిక్షిప్తమై ఉన్నాయి