ఒకసారి శవం గురించి మాట్లాడుకుందాం.
శవాల పట్ల మన ఆలోచనావిధానం గురించి మాట్లాడుకుందాం.
ఒక శవం గురించి మనం కారుస్తున్న
మొసలి కన్నీళ్ల గురించి కూడా మాట్లాడుకుందాం.
శవం పట్లా మరణం పట్లా మనకున్న ద్వేషం గురించి మాట్లాడుకుందాం.
భుజాల మీద ఓ వ్యక్తి తన భార్య శవాన్ని మోసుకెళ్తున్న వీడియో ద్రుశ్వాలను సాకు చేసుకుని టిఎంసీలకొద్దీ కన్నీళ్లు...టన్నుల కొద్దీ వేదన ....
తూచలేనంత మానవత్వ ప్రవచనం...లెక్కలేనంత దుఖ్కం గత కొద్దిరోజులుగా
సోషల్ మీడియాలో డ్రయినేజీ స్కీములేక తెగపారుతోంది.
కవిత్వమై లైకులై షేర్లయి కామెంట్లయి తెగ గుండెలు బాదేసుకుంటోంది.
ఎందుకిదంతా? దేనికిదంతా.? వై ? క్యోం?
ఇందుకు మనం అర్హులమేనా.
ఈ కన్నీళ్లు ఉప్పవేనా. ఈ వేదన నకిలీది అవునా కాదా.
శవం పట్ల మనం, మన చుట్టూ ఉన్న సజీవుల ధ్రుక్పథం ఏమిటి. మనం శవానికి ఇచ్చే స్ధానం ఏమిటి. మనం శవానికి ఇచ్చే గౌరవం ఆ మనిషి బతికున్నపుడు అతని సామాజిక ఆర్దిక స్థోమతను బట్టే కాదా.
ఒకరిదైతే శవం
మరొకరిదైతే భౌతికకాయం
ఇంకొకరిదైతే పార్దివదేహం.
మరింకెవరిదో అయితే మమ్మీ.
అయినా సరే ఇంత చేసినా
శవ సందర్శన అనంతరం ఇంటికి వెళ్లి స్నానం చేయాల్సిందే.
స్మశానం నుంచి నేరుగా ఇంట్లోకి వెళ్లకూడదు.
దొడ్డిదారిన వెళ్లి స్నానం చేసి మరీ ఇంట్లోకి వస్తేనే ప్రవేశం అనుమతి.
ఉన్నాడో లేడో గ్యారంటీలేని వాడి దర్శనానికి గుడికేమో స్నానం చేసి వెళ్ళాలి. కళ్లెదుటే ఉండి వెళ్లిపోయిన వ్యక్తిని సాగనంపిన తరువాత మాత్రం స్నానం చేయాల్సిందే.
ఇదేం చిత్రమో.
ఇక మాలధారణ చేసిన వారయితే అసలు శవం వైపే చూడరు. మనిషికంటే దేవుడు ఎందుకు గొప్పో వీళ్లు వివరణ ఇవ్వగలరన్న నమ్మకం నాకయితే లేదు.
జర్నలిస్టులయిన కొందరు సోకాల్డ్ బుద్దిజీవులు మాల ధరించి శవం దగ్గరకు ఉద్యోగ రీత్యాకూడా వెళ్లడానికి ఇష్టపడరు.
విధి నిర్వహణకంటే దైవం ఎందుకు గొప్పదో నాకయితే ఎప్పటికీ అర్దం కాదేమో.
దైవం కంటే శవమైన మనిషే గొప్పఅనే విషయం వాళ్లకు కూడా
ఎప్పటికీ అర్దం కాదేమో.
ఓకే ...దీని వెనుక సైన్సేమైనా ఉంటే సైన్స్గ్ గానే చెప్పండి. ఆచారం ముసుగు వద్దు.
కొన్ని కులాలకు చెందిన వారయితే అసలు శవసందర్శనకు గానీ పదకొండవ రోజు భోజనాలకు గానీ రానే రారు.
" మాదాంట్లో వెళ్లం కదా " అనే అర్దం పర్దంలేని సమాధానం.
ఈ సందర్బంలో నా అనుభవాలు కొన్ని......
నా సమీప బంధువొకావిడ భర్త ఆసుపత్రిలో మరణించాడు. వాళ్లుండేది అద్దె ఇల్లు. మరణవార్త తెలిసిన ఆ ఇంటి యజమాని ఆసుపత్రిలో దుఖ్ఖంలో ఉన్న ఆవిడకు ఫోన్ చేసి మీరు శవాన్ని మా ఇంటికి తేవద్దు అని చెప్పేసాడు. ఆవిడకు మ్రుతదేహాన్ని తీసుకువెళ్లడానికి మరో ఆప్షన్ కూడా లేదు పాపం. విషయం తెలిసి నేను మా ఇంటికి తీసుకురమ్మన్నాను. నాది కూడా అప్పుడే కట్టుకున్న కొత్త ఇల్లు. నేనూ కొంత నిరసనను ఎదుర్కోవల్సి వచ్చింది.
స్వయానా నా మామగారి బాడీని నేను ఖమ్మం నుంచి కోదాడ తీసుకువెళ్లడానికి కారు దొరకక నానా ఇబ్బందీ పడ్డాను. అద్దెకార్ల వాళ్లు శవాన్ని తీసుకువెళ్లడం కష్టం సార్ అని చెప్పి తప్పించుకున్నారు. తీసుకెళ్లడానికి అంగీకరించిన ఒకరిద్దరు ఐదురెట్ల మొత్తం అడిగారు.
ఎందుకంటే " కారు మొత్తం పూజచేయించి వాష్ చేయించాలి సార్ " అన్నది సమాధానం.
మనిషే స్నానం చేసి, శవం నడయాడిన చోట పసుపునీళ్లు చల్లి,మరణం సంభవించిన ఇంటిని సంప్రోక్షణచేయడం వంటి పాపకార్యాలకు ఒడి గట్టే చోట
కార్ వాష్ దేముంది.
మరణం తరువాత మైల పేరిట మరో ప్రహసనం.
ఒకే ఇంటి పేరయితే పదకొండు రోజులు ఇంకొంచెం దూరంవారయితే మూడు రోజులు..ఇదో వింత అంటు...వ్యాధి.
ముట్టుకోకూడదు. వాళ్లు వాడిన వస్తువులను వాడకూడదు.
చాలా సందర్బాలలో అత్యంత ఆత్మీయుల మరణం తరువాత కూడా ఆ దేహాన్ని ఇంట్లో ఉండనివ్వరు.
వెంటనే చావిట్లోకి మార్చాల్సిందే.
ఆ ఇంట్లో సంవత్సరం పాటు శుభకార్యం పరార్.
ఒక వేళ ఏ బలవన్మరణమో అయితే ఇక ఆ ఇల్లు హారర్ సినిమాయే.
*****
గిరిజన ప్రాంతంతో పరిచయం ఉన్న వాళ్లకు శవాలతో మైళ్ల కొద్దీ జరిగే ప్రయాణం వింతగా అనిపించదు.
అదొక సర్వసాధారణ బాధ.
ఏజెన్సీలో భుజాలమీదో కావడిలోనో
శవాలు రవాణా కావడం కొత్తగా ఉండనే ఉండదు.
అదొక రొటీన్ విషాదం.
ఇదంతా నేనెందుకు చెపుతున్నానూ అంటే శవం గురించి కన్నీళ్లు చిమ్మే అర్హత శవాన్ని ప్రేమించే వాళ్లది మాత్రమే .
మొదట శవాన్ని గౌరవించండి.
శవాన్ని కనీసం ద్వేషించకండి.
శవాన్ని తోటి మాజీ మనిషిగా పరిగణించండి.
అప్పుడీ కండక్టర్ శవాన్ని
బస్ లో ఎక్కించుకోకపోవడం,
శవరవాణాకు వాహనం దొరక్కపోవడం వంటి విషాదాలుండవు.
వ్యవస్ధను తిట్టడం, ప్రభుత్వాలను పాలకులనూ తప్పుపట్టడం, ఆశవం మోత ద్రుశ్యాన్ని భారతదేశ చిత్రపటంగా చెక్కడం, కవిత్వభాషలోనో ఫోటోషాప్ స్రుజనతోనో గుండెలు మోదుకోవడం కాదు చేయాల్సింది.
చేయాల్సిందల్లా భౌతికకాయాన్ని మనస్పూర్తిగా ప్రేమించడం.
అంట్లు మైలలు శుద్దులూ సంప్రోక్ష్లణలూ లేని ఆలోచనా విధానాన్ని స్రుష్టించడం.
సంఘటనలూ దుర్ఘటనలూ ఎక్కడో హర్యానాలో లేవు. మనలోనే ఉన్నాయి.
శవమంటే కేవలం ప్రాణంలేని మనిషి.
మనిషంటే కేవలం ప్రాణమున్న శవం.
అందుకే...
జస్ట్ లవ్ ది డెడ్ బాడీ!!
కనీసం రెస్పెక్ట్ద్ ది డెడ్ బాడీ!!!
Author; Mr Prasen Journalist and Poet from Khammam.