ఆదిపర్వము -
శ్రీకృష్ణ, పాండవుల సమాగమం
🌺🌺🌺🌺🌸🌸🌺🌺🌺🌺
భీమార్జునులు ద్రౌపదిని తమతో తమ విడిదికి తీసుకొని వెళ్లారు. అప్పటికే కుంతీ దేవి చాలా ఆందోళనగా ఉంది. స్వయంవరోత్సవాన్ని చూడటానికి వెళ్లిన వాళ్లు ఇంకా ఎందుకు రాలేదు. ఒకవేళ కౌరవులు వారిని గుర్తించి చంపేశారా లేక వేరే కారణం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ధర్మరాజు, నకుల సహదేవులు ముందు వచ్చారు. తరువాత కొంచెం సేపటికి భీమార్జునులు వచ్చారు.
రాగానే అర్జునుడు "అమ్మా, మేము ఒక బిక్ష తీసుకొని వచ్చాము" అని అన్నాడు. దానికి కుంతీ దేవి సంతోషించి "మీరు ఐదుగురు ఉపయోగించండి " అని బదులు చెప్పింది. కాని కొడుకు తెచ్చిన బిక్ష ఒక కన్య అని తెలిసి అధర్మం పలికినందుకు భయపడింది. "అయ్యో ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం. ధర్మజా, ఇది లోక విరుధ్ధము. ఇప్పుడు ఏమి చేద్దాము" అని అడిగింది.
అప్పుడు ధర్మరాజు అర్జునుని చూసి "అర్జునా ఈమెను నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి అగ్నిసాక్షిగా నువ్వే వివాహమాడుము"అన్నాడు. దానికి అర్జునుడు "పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు. ఈమెను మీరే వివాహం చేసుకోండి" అని చెప్పాడు.
(ఇక్కడ నన్నయ ఒక పద్యం పాదం రాసాడు
"ఆ లలితాంగి యందు హృదయంబులు దృష్టులు
నిల్పి పాండు భూపాల తనూజ పంచకము
పంచ శరాహుతి బొందె నొక్కతన్" అంటే మనసులో పాండవులు ఐదుగురు మనసుపడ్డారు, మోహము చెంది ఉన్నారు" అని అర్థం. కాని పైకి మాత్రం నువ్వు పెళ్లి చేసుకో అంటే నువ్వు పెళ్లి చేసుకో అని అనుకుంటున్నారు. ఎంత గొప్పవారైనా స్త్రీ విషయం వచ్చేటప్పటికి, ఒకే విధంగా ఆలోచిస్తారు కదా)
ఇది ధర్మరాజు గ్రహించాడు, మనలో మనకు తగవులు ఎందుకని. మనం ఐదుగురము ద్రౌపదిని వివాహం చేసుకుందాము అని అన్నాడు.
ఇంతలో శ్రీకృష్ణుడు బలరామ సహితుడై అక్కడకు వచ్చాడు. అప్పటిదాక పాండవులు శ్రీకృష్ణుని చూడలేదు. అందుకని
శ్రీకృష్ణుడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ధర్మజునికి కుంతీ దేవికి నమస్కరించాడు.
ధర్మరాజు కృష్ణుని చూసి "బ్రాహ్మణ వేషములలో ఉన్న మమ్ము మీరు ఎలా గుర్తుపట్టగలిగారు?" అని అడిగాడు.
"ధర్మజా, సూర్యుని మేఘములు కప్పిన, సూర్యుని తేజస్సును దాచగలవా. అలాగే మీరు బ్రాహ్మణ వేషములలో ఉన్నా మీ తేజస్సును దాచలేరు కదా. అందువలన గుర్తుపట్టాను.
అదియునుకాక, అంతటి మత్స్యయంత్రాన్ని కొట్టడం, రాజులనందరిని ఎదిరించడం మీకు కాక మరొకరికి సాధ్యమా. మీరు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు మీకు అంతా శుభమే జరుగుతుంది" అని చెప్పి ఖృష్ణుడు, బలరాముడు వెళ్లిపోయారు.
(మహాభారతంలో ఇది శ్రీకృష్ణ పాండవుల సమాగమము. ఈ సమాగమము, శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా బోధ చేసేవరకు
ఎదిగింది. ప్రథమ సమగమానికి వేదిక ఒక కుమ్మరి వాని ఇల్లు. సమయం, పాండవుల వివాహ సమయం. గీత బోధకు వేదిక యుధ్ధరంగము. సమయము ఇంకొంచెం సేపట్లో యుధ్ధం మొదలుకాబోతుంది. ఇక్కడ సంసారము అనే విచిత్రమైన యుధ్ధరంగములో ప్రవేశించబోయే సమయం. అక్కడ అన్నదమ్ముల మధ్య, బంధు మిత్రుల మధ్య యుధ్ధములో ప్రవేశించబోయే సమయం.
కుమ్మరి వాని ఇల్లు కూడా కాకతాళీయంగా ఒక మహత్తరమైన సత్యం చెప్తుంది. కుమ్మరి మట్టితో ఎన్నోరకాలైన పాత్రలు తయారు చేస్తాడు, కాని మూలం మట్టి. పాంచ్ బౌతికమైన ఈ శరీరాలు కూడా వివిధ ఆకృతులు ధరించి ఈ లోకంలో సంచరించినా, అన్నింటికి మూలం పంచభూతాలు, ఈ ప్రకృతి. ప్రతి జీవిలో ఒక జీవాత్మ ఉన్నా,అన్ని జీవులకు మూలం ఆ పరమాత్మ. ఈ సత్యాన్నే గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు. )
ఇది ఇలా ఉండగా అక్కడ ద్రుపదుడు "ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ద్రౌపదిని తీసుకొని వెళ్లాడు. వారు ఎవరొ తెలియదు. వారి చరిత్ర ఏమిటో తెలుసుకొని రా" అని తన కుమారుడు ధృష్టద్యుమ్నుని పంపించాడు.
ధృష్టద్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్లి జరిగినదంతా చుసాడు.తండ్రి వద్దకు వచ్చి "తండ్రీ, ఆ ఇరువురు చెల్లి ద్రౌపదిని తీసుకొని వెళ్లి ఒక పెద్దామెకు చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పిన ప్రకారం, మిగిలిన నలుగురు బయటకు వెళ్లి బిక్ష తీసుకొని వచ్చారు. అందులో కొంత భాగం బలిదానాలకు, అతిథులకు తీసిపెట్టారు. మిగిలిన దానిలో, సగ భాగం బలిష్ఠుడైన రెండోవానికి పెట్టారు. మిగిలిన సగభాగం, మిగిలిన వారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది. వారందరికి ధర్భలతో పడకలు తయారుచేసింది. వారందరూ పడుకొని ఏనుగులు, గుఱ్ఱాలు, యుధ్ధాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. వీరిని చూస్తే బ్రాహ్మణులవలె లేరు. శ్రేష్టమైన రాజవంశములో పుట్టిన వారి మాదిరి ఉన్నారు" అని చెప్పాడు ధృష్టద్యుమ్నుడు.
అయినా ద్రుపదునికి నమ్మకం కుదరలేదు. తన పురోహితుని పంపి, వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని రమ్మన్నాడు. పురొహితుడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్లాడు. ఆ బ్రాహ్మణునికి పాండవులు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి
సత్కరించారు.
అప్పుడు ఆ పురోహితుడు "బ్రాహ్మణోత్తమా, ద్రుపదుడు ఆడ పిల్ల తండ్రి కదా. అందువలన మీ కులం, గోత్రం, పేర్లు మిగిలిన వివరాలు తెలుసుకొని రమ్మని ద్రుపదుడు నన్ను పంపించాడు. దయచేసి ఆ వివరాలు చెప్పండి" అన్నాడు.
దానికి ధర్మరాజు నవ్వుతూ "విప్రోత్తమ్మా, మీ మహారాజు మత్స్యయంత్రాన్ని కొట్టిన వారికి తన కుమార్తెను ఇస్తాను అన్నాడు. అలాగే మా వాడు మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు, మీ మహారాజు కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మా కుల, గోత్రాలు తెలుసుకోవడం ఎందుకు? తెలుసుకొని ఏమి చేస్తాడు? అయినా అంత బలమైన విల్లును ఎక్కుపెట్టడం ఎవరికి సాధ్యం అవుతుంది? మత్స్యయంత్రం వీరులు కాక మరొకరు కొట్టగలరా? మీ మహారాజు కోరిక తీరినది కదా, ఇంకా విచారించడం ఎందుకు?" అని నర్మగర్భంగా అన్నాడు. చేసేది లేక, ఆ పురోహితుడు అదే విషయాన్ని ద్రుపదునికి చెప్పాడు.
ద్రుపదునికి సందేహం కొంతవరకు తీరింది కాని, ఇంకా కొరతగానే ఉంది. అందుకని వారిని తీసుకురమ్మని, నాలుగు జాతుల వారికి అనువైన రథాలను ఇచ్చి ధృష్టద్యుమ్నుని పాండవుల వద్దకు పంపాడు. పాండవులు అది చూసి, క్షత్రియులకు ఉచితమైన బంగారు రథాలను ఎక్కి ద్రుపదుని వద్దకు వచ్చారు.
పాండవులకు ఎదురు వెళ్లి వారికి అతిథి సత్కారాలు గావించాడు. ఎన్నో వస్తువులను కానుకగా పంపాడు ద్రుపదుడు. కాని పాండవులు క్షత్రియులకు ఉచితమైన కత్తులు, విల్లులు, బాణములు మాత్రం తీసుకున్నారు. ఇది చూసి ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. వారు క్షత్రియులు అని నిర్థారణ చేసుకున్నాడు. కాని వారి నోటితొ చెపితేనే బాగుంటుందని అనుకున్నాడు.
ధర్మరాజు పక్కనే కూర్చుని "అయ్యా, మీరు క్షత్రియులా, బ్రాహ్మణులా, లేక దేవతలా, గంధర్వులా మాకు సందేహముగానున్నది. మీ నిజ స్థితి తెలుసుకోకుండా నా కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యలేను కదా.అందువలన తెలుసుకోగోరుతున్నాను" అని నిర్మొహమాటంగా చెప్పాడు. ఇంక దాచి ప్రయోజనం లేదనుకున్నాడు ధర్మరాజు.
"ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము. పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మజుడు, వీరు భీమార్జున నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని చేధించినది నా తమ్ముడు అర్జునుడు. ఈమె మా తల్లి కుంతీదేవి" అని చెప్పాడు.
ఆ మాటలు విని ద్రుపదుడు అత్యధిక సంతోషాన్ని పొందాడు. తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ద్రుపదుడు ధర్మజుని పక్కన కూర్చుని "విచిత్ర వీర్యుని మనుమడు, పాండురాజు పుత్రుడు, అర్జునుడు నాకు అల్లుడు కావడం ఎంతో సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతనిని వరించిన కన్యను, అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను" అని అన్నాడు ద్రుపదుడు.
దానికి ధర్మరాజు "అది ఎలా కుదురుతుంది. అర్జునుని కన్న, ఇద్దరం పెద్దవాళ్లము ఉన్నాము. మా వివాహాలు జరగంది అర్జునునికి వివాహం ఎలా చేస్తాము" అని అన్నాడు.
అప్పుడు ద్రుపదుడు "అలా ఐతే పెద్ద వాడివి నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకో. ధర్మ బధ్ధంగా ఉంటుంది" అని అన్నాడు.
"అలా కాదు, అర్జునుడు తెచ్చిన బిక్ష ఐదుగురు పొందాలని మా తల్లి కోరిక. అందూవలన ఈ కన్యను మేము ఐదుగురము వివాహం చేసుకుంటాము" అన్నాడు ధర్మరాజు.
ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. "అదేమిటి, ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహమాడటం విన్నాను. కాని ఒక కన్య ఎక్కువ మంది పురుషులను వివాహమాడటం ఎక్కడా వినలేదు. ఇది లోక విరుధ్ధం. కాబట్టి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము" అని అన్నాడు.