శివపురాణం -37.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హాలాహల భక్షణం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
సాక్షాత్తు పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకమాట అన్నాడు. ‘పార్వతీ నన్ను ఎందఱో స్తోత్రం చేశారు. నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా! అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమయిన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడిన స్తుతిలో ఒక్క శ్లోకం గాని, అర్థ శ్లోకం గాని ఒక పాదం కాని, అవేమీ రాకపోతే ఒక మాట కానీ అదీ రాకపోతే అది వినడం కానీ చేసిన వారికి నేను నా అనుగ్రహమును వర్షిస్తాను’ అని చెప్పాడు. ఈవిషయం మహానుభావుడు పోతనగారు వీరభద్ర విజయంలో చెప్పారు.
ఒకానొకప్పుడు దేవతలు దానవులు అమృతోత్పాదనం చేయాలనీ క్షీరసాగర మథనం చేశారు. మందర పర్వతమును తీసుకు వెళ్ళి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడే పామును చుట్టారు. దానిని దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు పట్టుకుని తిప్పుతున్నారు. యథార్థమునకు ఇదంతా ధ్యాన సంబంధమయిన విషయం. లోపల మనస్సును తిప్పినప్పుడు వచ్చే స్థితియందు ఈశ్వరానుగ్రహం ఎలా పొందాలి అన్నది దీనిద్వారా తెలియజేయబడుతుంది. ఆ మందర పర్వతం క్రిందికి దిగిపోకుండా ఉండడం కోసం ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీమహా విష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఈ మందర పర్వతమును ఆయన వీపు మీద పెట్టారు. దానిని ఎంత తిప్పినా ఆయన వీపు దురద తీరలేదు. అలా తిప్పుతుంటే పాలసముద్రంలో ఉన్న పాములు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో కలిసి పైకిలేచి ఒడ్డున పడ్డాయి. తాబేలుతో గొడవ ఉండదు. అది భూమిమీదపడినా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. కానీ చేప ఒకసారి ఒడ్డునపడితే ఇక దానిజీవితం అయిపోయినట్లే. ఆ పర్వతం తిరుగుతుంటే వచ్చిన చప్పుడుకి బ్రహ్మలోకంలో తపోనిష్ఠలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. వాళ్ళు కోరుకున్నది అమృతం. మొట్టమొదట పుట్టింది హాలాహలం. ఆ పుట్టిన హాలాహలం పెద్దపెద్ద గంతులు వేసుకుంటూ భూమిమీదకి వచ్చింది. అది వెళుతుంటే నదులు ఇంకిపోయాయి. అరణ్యములు కాలిపోయాయి. అలా అన్నింటినీ బూది చేస్తూ హాలాహలం వెళ్ళిపోతోంది. అందరూ పరమశివుడి దగ్గరకు పరుగెత్తారు.
పరమశివుడు ‘మీకు ఏమి కష్టము వచ్చింది’ అని అడిగారు. ఈశ్వరా నీవు అంతటా నిండిపోయిన వాడవు. నీకు తెలియనిది ఏమీ ఉండదు. నీవు మమ్మల్ని రక్షించాలి. అని స్తోత్రం మొదలుపెట్టారు. చంద్రరేఖ ధరించిన ఓ ఈశ్వరా, మమ్మల్ని చంపడానికి అవతలివైపు నుంచి హాలాహలం వచ్చేస్తోంది. దానిని పుచ్చుకోగల సమర్థుడవు నీవే. తండ్రీ మమ్మల్ని రక్షించవా’ అని అడిగారు. అపుడు శంకరుడు పార్వతీదేవి వంక చూశాడు.
కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము దాన గీర్తి మృగాక్షీ!!
ఈశ్వరీ జగత్తు అంతా ఎంత దుఃఖపడిందో చూశావా! మనం లోకములకంతటికీ ప్రభువులం. మన పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తొలగింపజేయాలి. వాళ్ళ కష్టమును మనం గట్టెక్కించాలి. కాబట్టి హాలాహలమును నేను పుచ్చేసుకుంటాను. అలా నేను పుచ్చుకుంటానని బెంగ పెట్టుకుంటున్నావా? హాలాహలం పుచ్చుకుంటే నేనేమయినా అయిపోతానని అనుకుంటున్నావా?
శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!
బాగా విచ్చుకున్న పద్మము వంటి ముఖమున్న పార్వతీ, నాకు ఏమీ అవదు. నేను ఆ హాలాహలమును శిక్షిస్తాను. దానిని ఒక మధుర ఫలముగా నోట్లో వేసేసుకుంటాను. ప్రాణికోట్లను రక్షణ చేస్తాను. ఎలా స్వీకరిస్తానో చూడు అన్నాడు. ఆవిడ మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పింది. తన మేడలో మంగళ సూత్రం ఉండగా ఆయన హాలాహలం పుచ్చుకున్నా ఆయనకు ఇబ్బంది రాదు అనే ప్రగాఢ నమ్మకం ఆమెకు ఉన్నది. అందుకని అడ్డు చెప్పలేదు. పరమశివుడు హాలాహలమునకు ఎదురు వెళ్ళాడు. దేవతా గనములన్నీ ఆయనకు జయజయ ద్వనములు చేస్తున్నాయి. శివుడు హాలాహలమును చేతితో పట్టుకుని ముద్దగా చేసి నేరేడు పండంత చేసుకుని దానిని పుచ్చేసుకుని మ్రింగి వేయడానికి సిద్ధపడిపోయారు. కంఠం దగ్గరికి వెళ్ళింది. అపుడు శివుడు అయ్యయ్యో ఇపుడు నేను కడుపులోకి ఈ విషాన్ని వదిలేస్తే కడుపులో ఉన్న లోకములు కాలిపోతాయి. పైకి వదిలి వేస్తె ఈ లోకములు కాలిపోతాయి. కాబట్టి దీనిని వదలకుండా ఉంచుతానని దానిని తన కంఠంలో పెట్టేసుకున్నాడు. కంఠం నీలంగా మచ్చ పడినట్లుగా కనపడుతోంది. అప్పటివరకు ఆయనకు మచ్చ లేదు. తెల్లటి శంకరుడు. కంఠంమీద కొంచెం నల్లగా మచ్చ కనపడుతోంది. లోకములను రక్షించదానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకు ఆభరణమై కూర్చుంది.
ఈ హాలాహాల భక్షణం గురించి ఒక సందర్భంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పవలసి వచ్చింది. పార్వతీ ఈవేళ ఈ హాలాహాల భక్షణ కథ నీకు ఎందుకు చెప్పానో తెలుసా?
హాలాహాల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్
వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై!!
ఇప్పటివరకూ ప్రపంచంలో హాలాహల భక్షణ కథ వినినా చదివినా అటువంటి వాళ్ళను తేళ్ళు జెర్రులు పాములు కరవవు అని లోకంలో ఫలశ్రుతి ఉంది. కాబట్టి ఈ కథను అందుకోసం వింటూంటారు. కానీ పార్వతీ ఇవాళ నేను నీకొక రహస్యం చెప్తున్నాను. ఆ సమయంలో దేవతలు వచ్చి నన్ను చేసిన స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కానీ, ఒక పద్యం కాని, నోటికి వచ్చినా కనీసంలో కనీసం దేవతలు చేసిన స్తోత్రంలో కనీసం రెండు పాదములు నేర్చుకున్నా కనీసం ఒక పాదం నోటికి వచ్చినా కనీసం నీలకంఠ అన్నమాట వస్తే చాలు. చాలా భక్తితో చెప్పబడిన ఈ వృత్తాంతం పరమసత్యం అని మనస్సునందు విశ్వసించి నా కంఠమును ఒక్కసారి ధ్యానం చేసి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, ఈ వృత్తాంతమును చదివిన వారికి విన్నవారికి ఇహమునందు సకల సంపత్తులు కలుగుతాయి. వారికి ఏ బాధా ఉండదు. అటువంటి వాడు తేలికగా అంత్యమునందు శరీరము నుండి విడివడి నన్నుచేరి కైలాసమునందు వసించి సర్వకాలముల య్నాడు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠస్తవము, హాలాహాల భక్షణము అనే ఆఖ్యానం చాలా ఉత్కృష్టమయినది.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About